పాడి పశువుల్లో సరోగసీ
బొబ్బిలి: పాడిపశువుల్లో సరోగసీ విధానంలో దూడల సంతానోత్పత్తికి చర్యలు తీసుకుంటు న్నామని పశుసంవర్థక శాఖ జేడీ కె.మురళీకృష్ణ తెలిపారు. స్థానిక డీడీ కార్యాలయంలో విలేకర్లతో బుధవారం మాట్లాడారు. పిండ మార్పిడితో పశువులు చూడికట్టిస్తున్నామని చెప్పారు. రామభద్రపురం, ఆరికతోటల్లోని పశువైద్య కేంద్రాల డాక్టర్లు సరోగసీ విధానంపై శిక్షణ పొందారన్నారు. గిర్, జెర్సీ, ఒంగోలు వంటి జాతులను ఈ ప్రక్రియ ద్వారా అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. ఎకరాకు 150 నుంచి 200 టన్నుల దిగుబడి వచ్చే పశుగ్రాస విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. 50 సెంట్ల విస్తీర్ణంలో పశుగ్రాసం పెంచేందుకు రూ.32,998ల వ్యయాన్ని ఉపాధిహామీ నిధుల నుంచి పాడి రైతులకు అందజేస్తామని చెప్పారు. దాణాను 50 శాతం రాయితీపై అందజేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆయన వెంట ఏడీ ఎల్.విష్ణు ఉన్నారు.


