ముంపు ప్రాంతాల్లో జెడ్పీ చైర్మన్ పర్యటన
● తుఫాన్ నష్ట నివారణలో సచివాలయ వ్యవస్థ భేష్
రాజాం/నెల్లిమర్ల/మెరకముడిదాం:
జిల్లాలో మోంథా తుఫాన్ ముంపు ప్రాంతాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు బుధవారం పరిశీలించారు. మెరకముడిదాం మండలంలో మెరకముడిదాం, సోమలింగాపురం, ఎం.రావివలస గ్రామాల్లో తుఫాన్ వర్షాలు కారణంగా నష్టపోయిన వరి పంట పొలాల్లోకి వెళ్లి రైతులతో మాట్లాడారు. పడిపోయిన పంటను పరిశీలించి, నష్టంపై ఆరా తీశారు. తహసీల్దార్ సులోచనారాణి, ఎంపీడీఓ భాస్కరరావును వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి రాజాం మండలంలో లక్ష్మీపురం, నందబలగ, శ్యాంపురం, కొఠారిపురం గ్రామాల్లోని పంటపొలాలు పరిశీలించారు. ముంపు పరిస్థితిని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని రైతులకు హామీ ఇచ్చారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. మోంథా తుఫాన్ కొన్ని ప్రాంతాల్లోని రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చిందన్నారు. నీటమునిగిన పంట పొలాలను పరిశీలించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. మెంథా తుఫాన్ నష్టాన్ని నివారించడంతో సచివాలయ వ్యవస్థ బాగా పనిచేసిందని పేర్కొన్నారు. సచివాలయ ఉద్యోగులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం, ప్రజలను అప్రమత్తం చేయడం వల్ల ఆస్తి, పంట నష్టాలశాతం తగ్గిందన్నారు. ప్రాణ నష్టం జరగకుండా చూడడంలో సచివాలయ సిబ్బంది పాత్ర ఉందన్నారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో ముందుచూపుతో అందుబాటులోకి తెచ్చిన వ్యవస్థ ఆపద సమయాన ఆదుకుంటోందన్నారు. కలెక్టర్ సైతం సిబ్బంది సేవలను అభినందించారన్నారు. ఆయన వెంట పార్టీ రాజాం నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ తలే రాజేష్, పార్టీ నియోజకవర్గ పరిశీలకులు కేవీ సూర్యనారాయణరాజు, తదితరులు ఉన్నారు.
విద్యార్థినులకు పరామర్శ
నెల్లిమర్ల ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న గుర్ల మండలం కేజీబీవీ విద్యార్థినులను జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు బుధవారం పరామర్శించారు. పాఠశాలలో జరిగిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌పై ఆరాతీశారు. మెరుగైన వైద్యం అందించాలని విద్యార్థులకు సూచించారు.
ముంపు ప్రాంతాల్లో జెడ్పీ చైర్మన్ పర్యటన


