పదహారేళ్లకే పెళ్లి.. పదిహేడేళ్లకే తల్లి
● తక్కువ వయసులోనే గర్భం దాల్చుతున్న బాలికలు
● బాల్య వివాహాల వల్లే ఈ దుస్థితి
విజయనగరం ఫోర్ట్: జామి మండలానికి చెందిన ఓ బాలికకు 16 ఏళ్లకే వివాహమైంది. దీంతో అ బాలిక 17ఏళ్లకే తల్లయింది. గంట్యాడ మండలానికి చెందిన బాలికకు 17 ఏళ్లకే వివాహం కాగా 18 ఏళ్లకే తల్లయింది. ఇలా వీరిద్దరే కాదు. అనేక మంది టీనేజ్‌లో గర్భం దాల్చి ప్రసవిస్తున్నారు.
ఆడిపాడే వయసులో పిల్లలను చంకలో ఎత్తుకుని తిప్పుతూ వారిని ఆడించాల్సిన పరిస్థితి. తోటి విద్యార్థులతో ఆనందంగా ఉండాల్సిన సమయంలో కుటుంబ భారాన్ని మోయాల్సిన దుస్థితి. పిల్ల లను ఏవిధంగా సాకాలో కూడా వారికి తెలియదు. టీనేజ్‌లో గర్భం దాల్చి తల్లి అవడం వల్ల ఎన్నో అనర్థాలు ఉన్నప్పటికీ తక్కువ వయసులో వివాహాలు చేసేయడంతో ఈ పరిస్థితి దాపురిస్తోంది.
పెళ్లి గురించి పూర్తి స్థాయిలో అవగాహన లేక పోయినప్పటికీ పెద్దలు చెప్పారని బాల్య వివాహం చేసుకోవడంతో 16, 17 ఏళ్లకే గర్భం దాల్చుతున్నారు. గర్భస్థ సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా వారికి తెలియవు. ఫలితంగా 17 ఏళ్లు, 18 ఏళ్లకే తల్లులవుతున్నారు.
టీనేజ్‌లో గర్భంతో నష్టాలు
టీనేజ్‌లో గర్భం దాల్చడంతో పాటు తల్లులవడం వల్ల అనేక నష్టాలు ఉన్నాయి. టీనేజ్‌లో గర్భం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం క్షీణిస్తుంది. నెలలు నిండకుండా బిడ్డ పుట్టడం, తక్కువ బరువుతో శిశువు పుట్టడం వంటి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. మానసిక ఒత్తిడి, పేదరికం వంటి సమస్యలు కూడా వస్తాయి. టీనేజ్‌లో తల్లి అవడం వల్ల నెలలు నిండకుండానే ప్రసవిస్తారు. రక్తహీనత, బీపీ వంటి సమస్యలు వస్తాయి. శిశు మరణాలు సంభవిస్తాయి. బిడ్డకు పుట్టకతోనే ఆరోగ్య సమస్యలు వస్తాయి. టీనేజీలో పెళ్లిళ్లు చేయడం వల్ల చదువు మధ్యలోనే మానివేస్తారు. పుట్టే పిల్లలు తరచూ కామెర్లు, మలేరియా వంటి సమస్యల బారిన పడతారు.
జిల్లాలో 142 మంది టీనేజ్‌లో గర్భిణులు
జిల్లాలో జనవరి నుంచి ఇప్పటి వరకు 142 మంది టీనేజ్ లో గర్భవతులయ్యారు. అదేవిధంగా 71 మంది తల్లులయ్యారు. భోగాపురం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో 24 మంది టీనేజ్‌లో గర్భం దాల్చి 13 మంది తల్లులయ్యారు. గరివిడిలో 22 మంది గర్భం దాల్చగా ఆరుగురు తల్లుల య్యారు. గజపతినగరంలో 18 మంది గర్భం దాల్చగా ఆరుగురు తల్లులయ్యారు. రాజాం 15 మంది గర్భం దాల్చి ఆరుగురు తల్లులయ్యారు. బాడంగిలో 10 మంది గర్భిణులకు 10 మంది తల్లులయ్యారు. వియ్యంపేటలో 12 మంది గర్భం దాల్చి ఏడుగురు తల్లులయ్యారు. చీపురుపల్లిలో 9 మంది గర్భంగా దాల్చగా ఐదుగురు తల్లులయ్యారు. బొబ్బిలిలో ఐదుగురు గర్భం దాల్చి ముగ్గురు తల్లులయ్యారు. గంట్యాడలో ముగ్గురు గర్భం దాల్చగా ఇద్దరు తల్లులయ్యారు.
టీనేజ్‌లో గర్భం వల్ల సమస్యలు
టీనేజ్‌లో గర్భం దాల్చి తల్లులవడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే ఆస్కారం ఉంది. బాల్య వివాహాలు చేయడం వల్లే తక్కువ వయసులో గర్భం దాల్చి తల్లులవుతున్నారు. 18 ఏళ్లు నిండిన వరకు ఆడపిల్లలకు వివాహం చేయకూడదు. ప్రతి తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలి.
డాక్టర్ ఎస్.జీవనరాణి, డీఎంహెచ్‌ఓ


