కూలిన ఇంటి గోడ
● త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
● ప్రాణాలతో బయటపడ్డ ఐదుగురు
గజపతినగరం: మండలంలోని గంగచోళ్లపెంట గ్రామంలో తుఫాన్ వర్షాలకు ఓఇంటి గోడ కూలిపోయింది. బుధవారం తెల్లవారు జామున జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన కనకల రామ అనే వ్యక్తి పెంకిటింటిలో కాళ్ల సంతోషి, సన్యాశినాయుడు దంపతులతో పాటు వారి ఇద్దరు కవలపిల్లలు, సన్యాసినాయుడు అత్త కంటుభుక్త నారాయణమ్మ అద్దెకు ఉంటున్నారు. అయితే కురుస్తున్న వర్షాలకు ఒక్కసారిగా తెల్లవారు జామున ఒక పక్క ఇంటి గోడ కూలిపోతుందన్న విషయాన్ని గ్రహించిన సన్యాశినాయుడు తన భుజస్కందాలపై గోడను కాచి రెప్ప పాటులో కవల పిల్లలను, భార్య సంతోషి, అత్త నారాయణమ్మను కాపాడుకున్నాడు. వెంటనే ఆయన పక్కకు తప్పుకున్నాడు. ఆ సమయంలో సన్యాశినాయుడు మేల్కోక పోతే కవలపిల్లలు కాళ్ల సాయిమణికంఠ, కాళ్ల సహస్ర(7నెలలు)లతో పాటు భార్యభర్తలు, నారాయణమ్మలకు ప్రాణాపాయం జరిగి ఉండేదని గ్రామస్తులు, అధికారులు చెబుతున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న తహసీల్దార్ బి.రత్నకుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని కూలిపోయిన ఇంటిని పరిశీలించి కుటుంబసభ్యుల వివరాలు అడిగి తెలుసుకుని రికార్డులో నమోదు చేశారు.
సాలూరులో..
సాలూరు: తుఫాన్ నేపథ్యంలో మూడురోజులుగా కురుస్తున్న వర్షాలకు సాలూరు పట్టణంలోని చినవీధిలో గల ఓ పాత ఇంటి గోడ కూలిపోయింది. అయితే ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
కూలిన ఇంటి గోడ


