విద్యార్థుల ఆరోగ్య భద్రత ప్రధానం
పార్వతీపురం రూరల్: జిల్లాలోని వసతి గృహ, ఆశ్రమ పాఠశాలల్లోని విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి వైద్యాధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వైద్యాధికారులతో జేసీ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ తుఫాన్ ప్రభావంతో వాతావరణంలో వచ్చే మార్పుల దృష్ట్యా విద్యార్థులపై మరింత ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఏ ఒక్క విద్యార్థి అనారోగ్యానికి గురికారాదని హితవు పలికారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ, వారికి అవసరమైన మందులు ఇవ్వాలని పీహెచ్‌సీ వైద్యులకు సూచించారు. విద్యార్థుల ఆరోగ్య భద్రత ప్రధానంగా వైద్యసిబ్బంది పనిచేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా ఎస్ భాస్కరరావు, ఇతర వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.
జేసీ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి


