మరోవైపు ఆహ్లాదం
ఓవైపు ఆధ్యాత్మికం..
భక్తుల తాకిడి ఎక్కువ
కార్తీకమాసంలో ముక్తిధాం, షిర్డీసాయి క్షేత్రాలకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ క్షేత్రంలో ఉన్న ధ్యానమందిరంలో కాసేపు ధ్యానం చేస్తే మనసు ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. ఈ ప్రాంతం పిక్నిక్‌లకు అనుకూలంగా ఉండడంతో ఎక్కువ మంది వస్తుంటారు. చింతపల్లిబీచ్‌ను మరింత అభివృద్ధి చేయాల్సి ఉంది.
– పతివాడ భాస్కరరావు, పతివాడ
పూసపాటిరేగ: మనుసుకు ఉల్లాసాన్ని ఇచ్చే సముద్రతీరం..ఆహ్లాదకర వాతావరణం నడుమ ముక్తిధాం క్షేత్రం కొలువై ఉంది. కొబ్బరి, సరుగుగుడు తోటల మధ్య పర్యాటకులకు స్వాగతం పలుకుతున్న గోవిందపురం ముక్తిధాం క్షేత్రాన్ని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాల్సిందే. ఈక్షేత్రానికి సమీ పంలో నక్కానపేట షిర్డీసాయి నగర్‌లో రాష్ట్రంలోనే ఎత్తైన షిర్డీసాయి మహాస్థూపం, అలాగే సహజ సౌందర్యాలతో ఆహ్లాదకర వాతావరణంలో పర్యాటకులు మది దోచే చింతపల్లిబీచ్ ఉన్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఉభయగోదావరి జిల్లాల నుంచి లక్షలాది మంది పర్యాటకులు ముక్తిధాం క్షేత్రం, చింతపల్లిబీచ్, సముద్రంలో నిర్మించే తిరుమల ఫ్యూజిటెక్ వంతెన, నక్కానపేటలో షిర్డీసాయి మహాస్థూపం చూడడానికి ఏటా కార్తీకమాసంలో వస్తుంటారు. విజయనగరం నుంచి వచ్చే పర్యాటకులకు 35 కిలో మీటర్లు..పూసపాటిరేగ నుంచి వచ్చే పర్యాటకులకు 15 కిలోమీటర్లు, విశాఖపట్నం నుంచి వచ్చే పర్యాటకులకు 62 కిలోమీటర్లు, శ్రీకాకుళం నుంచి వచ్చే పర్యాటకులకు 55 కిలో మీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. గోవిందపురం గ్రామం సమీపంలో 1991లో పోతినిండి కనకదుర్గమ్మ ముక్తిధాం క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ నిర్మించిన గీతామందిరంలో కొంత సేపు సేద దీరితే మనసు ఆధ్యాత్మిక భావంతో పులకించి పోతుందని భక్తులు చెబుతుంటారు. గీతామందిరం చుట్టూ రామాయణ, మహాభారత ఘట్టాలు చూపరులను కట్టిపడేస్తాయి. పాండవుల చరిత్ర, నందివిగ్రహం, దేవతామూర్తుల ఆలయాలు ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి.
రాష్ట్రంలో ఎత్తైన స్థూపం
గోవిందపురం రహదారిలో గల నక్కానపేట సమీపంలో రాష్ట్రంలో ఎత్తైన 141 అడుగుల షిర్డీసాయి మహాస్థూపం భక్తులను ఆకట్టుకుంటోంది. నిత్యం వందల సంఖ్యలో భక్తులు షిర్డీసాయి ఆలయం, షిర్డీసాయి మహాస్థూపాన్ని దర్శించుకుంటారు.
ఆహ్లాదపరిచే బీచ్
చింతపల్లి తీరంలో బీచ్ పర్యాటకులను కనువిందు చేస్తుంది. బీచ్‌లో హోయలొలికించే అందాలు ఆకట్టుకుంటాయి. బ్రిటిష్ కాలం నాటి లైట్‌హౌస్, సముద్రంలో నిర్మించిన తిరుమల ఫ్యూజిటెక్ వంతెన ఆకర్షణగా నిలుస్తాయి. ఈప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వమే రిసార్ట్స్, హోటల్స్ నిర్మించినప్పటికీ అందుబాటులోకి తీసుకురాలేదు. చింతపల్లితీరం పర్యాటకులను కట్టిపడేస్తుంది. కార్తీకమాసం పిక్నిక్ సీజన్ కావడంతో వేలాదిమంది పర్యాటకులతో సందడిగా ఉంటుంది.
చివరిదశలో చింతపల్లిలో నిర్మాణాలు
చింతపల్లితీరంలో పర్యాటకుల కోసం నిర్మించిన రిసార్ట్స్, విశ్రాంతి గదులకు మరమ్మతులు జరుగుతున్నాయి. వాటి చుట్టూ ప్రహరీ నిర్మాణం పూర్తయింది. త్వరలోనే పర్యాటకులకు అందుబాటులోకి తీసుకువస్తాం. చింతపల్లిప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందుతుంది. – కె. కుమార్,
జిల్లా పర్యాటకశాఖ అధికారి విజయనగరం
పర్యాటకులకు పవిత్రం
ముక్తిధాం క్షేత్రం
చింతపల్లిలో ఆహ్లాదకరమైన సముద్ర తీరం
నక్కానపేటలో షిర్డీసాయి
మహాస్థూపం
మరోవైపు ఆహ్లాదం
మరోవైపు ఆహ్లాదం
మరోవైపు ఆహ్లాదం


