సేవాదృక్పథంతో వైద్యసేవలు అందించాలి
● మంత్రి కొండపల్లి శ్రీనివాస్
విజయనగరం ఫోర్ట్: ఆస్పత్రికి వచ్చే వారికి సేవా దృక్పథంతో వైద్యసేవలు అందించాలని రాష్ట్ర ఎన్‌ఆర్‌ఐ, సెర్ప్ వ్యవహారాలశాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌అన్నారు. ఈ మేరకు పట్టణంలోని జొన్నగుడ్డి రోడ్డులో నూతనంగా నిర్మించిన సుఖీభవ హాస్పిటల్‌ను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన ప్రజలు అధికంగా ఉన్నారని, వారి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సేవలు అందించాలని సూచించారు. ఆధునాతన వైద్య పరిజ్ఞానంతో రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని, ఆపదలో ఉన్న రోగులకు చికిత్స అందించేటప్పడు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ఆస్పత్రి ఎం.డి పీఎస్‌వీ రామారావు మాట్లాడుతూ ఆస్పత్రిలో రోగికి ఇష్టమైన వైద్యుడు వచ్చి చికిత్స అందించవచ్చన్నారు. అదేవిధంగా అతి తక్కువ రేడియేషన్ పరికరాలను ఆస్పత్రిలో ఏర్పాటు చేసినట్లు తెలిపా రు. ఆస్పత్రిలో ఐసీయు, సీఐసీయూ, ఐఎంసీయు, హెచ్‌డీఐసీయు, పోస్టు ఆపరేటివ్ ఐసీయు, కేథల్యాబ్, కేథల్యాబ్ ఐసీయూ, డయాలసిస్ యూనిట్, సిటిస్కాన్ సేవలు అందబాటులో ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య, మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి, ఐఎంఏ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జేసీ నాయుడు, సుఖీభవ హాస్పల్ల్ డైరెక్టర్స్ డాక్టర్ పి.వి.శివరామ్, డాక్టర్ జె.శ్రీకాంత్, డాక్టర్ ఎ, శరత్ కుమార్ పాత్రో తదితరులు పాల్గొన్నారు.


