జానపద కళల పునరుజ్జీవానికి కృషి | - | Sakshi
Sakshi News home page

జానపద కళల పునరుజ్జీవానికి కృషి

Oct 27 2025 7:07 AM | Updated on Oct 27 2025 7:07 AM

జానపద కళల పునరుజ్జీవానికి కృషి

జానపద కళల పునరుజ్జీవానికి కృషి

గిడుగు రామమూర్తి తెలుగు భాష, జానపద కళాపీఠం

జానపద గురువులకు ఆత్మీయ సత్కారం

విజయనగరం టౌన్‌: అంతరించిపోతున్న జానపద కళల పునరుజ్జీవానికి గిడుగు రామమూర్తి తెలుగు భాష, జానపద కళాపీఠం ఎల్లప్పుడూ కృషిచేస్తుందని కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షుడు బద్రి కూర్మారావు పేర్కొన్నారు. ఈ మేరకు అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శనలిచ్చిన జానపద గురువులకు ఆత్మీయ సత్కారం గురజాడ స్వగృహంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళల ఖిల్లాగా ప్రసిద్ధికెక్కిన విజయనగరంలో కళాకారులకు కొదవలేదన్నారు. కళలను, కళాకారులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్‌ పి.శంకరరావు (విశాఖ) మాట్లాడుతూ ఒకప్పుడు దేదీప్యమానంగా విరాజిల్లిన జానపద కళలు ఆదరణ లేక అంతరించిపోవడం విచారకరమన్నారు. బుర్రకథ కళాకారుడు కుమ్మరి మాస్టారు, జాలారి నృత్య రూపకర్త, ప్రదర్శకుడు సంపత్‌ కుమార్‌ వంటి కళాకారులను విజయనగరం అందించిందని, అటువంటి కళలను బతికించేందుకు కృషిచేస్తున్న కూర్మారావు వంటి వారికి మనం చేయూతనివ్వాలని కోరారు. రానున్న రోజుల్లో అందరూ కలిసి కళలను ముందుకు తీసుకెళ్లి భావితరాలకు అందించాలన్నారు. ఈ సందర్భంగా జపాన్‌లో తప్పెటగుళ్లు ప్రదర్శించిన నీలబోని సత్యం, మలేషియాలో తెలుగువారికి చెక్క భజన, కోలాటంలో శిక్షణఇచ్చిన గురువులు మత్స తవిటినాయుడు, మాస్టర్‌ సాయికుమార్‌లను, కర్ణాటక, రాజస్ధాన్‌ రాష్ట్రాలలో తూర్పుభాగవతాన్ని ప్రదర్శించి అవార్డు పొందిన డీవీవీ జగన్నాథం పంతులు, బొంతలకోటి శంకరరావు, కొచ్చెర్ల అంజలి భాగవతార్‌, కొచ్చర్ల లక్ష్మి భాగవతార్‌లను ఘనంగా సత్కరించారు. ప్రతిగా కళాకారులు మాట్లాడుతూ ప్రభుత్వాలు, సాంస్కృతిక శాఖ, దేవాదాయశాఖ ఈ కళలను బతికించేందుకు తోడ్పాటునందించాలని లేకపోతే ఈ కళలు ఇంతటితో అంతరించిపోతాయన్నారు. సంస్థ వ్యవస్థాపకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్‌ జి.జనార్దననాయుడు, ధవళ సర్వేశ్వరరావు, ఈపు విజయకుమార్‌, జీఎస్‌ చలం, చీకటి దివాకర్‌, జీవీ శ్రీనివాస్‌, షేక్‌ గౌస్‌బాషా. డప్పు శ్రీను, ఎన్‌.చిన్నాదేవి, చంద్రిక రాణి, ఫణిశ్రీ, అట్టాడ లక్ష్డునాయుడు, మారినాయుడు, అప్పలరాజు, చింతా నాగేశ్వరరావులతో పాటు అధిక సంఖ్యలో కళాకారులు, కళాభిమానులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement