విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో పెంకుటిల్లు దగ్ధం
రామభద్రపురం: మండలంలోని కొట్టక్కిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఆదివారం ఓ పెంకిటిల్లు దగ్ధమైంది. ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పెద్దాడ సాయిరాజ్ ఇంటిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఫ్రిజ్‌లో మంటలు చెలరేగి ఇంటి దూలాలు అంటుకున్నాయి. అలాగే టీవీ, ఎలక్ట్రికల్ సామగ్రి, బట్టలు, కొంత మేర నగదు కాలిపోవడంతో సుమారు రూ.2.5 లక్షల ఆస్తినష్టం జరిగింది. సమాచారం మేరకు సాలూరు నుంచి అగ్నిమాపక వాహనం వచ్చి మంటలను అదుపులోకి తెచ్చింది. వివరాలను రెవెన్యూ అధికారులకు నివేదించినట్లు ఎస్సై వి. ప్రసాదరావు తెలిపారు.
రెండు ఆలయాల్లో చోరీ
● దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
నెల్లిమర్ల రూరల్: మండలంలో దొంగలు రెచ్చిపోతున్నారు. దొంగతనానికి దేవుడిని సైతం వదల్లేదు. ఆలయాల్లోకి చాకచక్యంగా ప్రవేశించి హుండీల్లో నగదును మాయం చేస్నున్నారు. ఈ తరహా ఘటనలు తరుచూ జరుగుతుడడంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. నెల్లిమర్ల మండలంలో శనివారం అర్ధరాత్రి రెండు ప్రధాన ఆలయాల్లో వరుస చోరీలు జరిగాయి. నెల్లిమర్ల–రణస్థలం ప్రధాన రహదారిలోని కొత్తపేట సమీపంలో ఉన్న శ్రీ సత్యనారాయణస్వామి ఆలయంలోకి ప్రవేశించిన గుర్తు తెలియని దొంగలు ఓ గదిలో భద్రపరిచిన హుండీని పగలగొట్టి సొత్తు దోచుకున్నారు. అనంతరం అదే రహదారిలో రామతీర్థం పంచాయతీ దేవుని నెలివాడ వద్ద ఉన్న శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో చోరీకి పాల్పడ్డారు. తొలుత తెలివిగా సీసీ టీవీ ఫుటేజీ కనెక్షన్లు తప్పించి హుండీలో నగదు చోరీ చేశారు. ఆదివారం ఉదయం చోరీ జరిగినట్లు గమనించిన ఆలయాల నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు ఎస్సై దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో సిబ్బంది ఆలయాలకు వెళ్లి పరిశీలించారు. క్లూస్ టీమ్ సిబ్బంది వేలి ముద్రలు సేకరించారు. ఆయా ఆలయ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై దుర్గాప్రసాద్ తెలిపారు. ఇటీవల గ్రామ దేవతల పండగలు జరిగిన నేపథ్యంలో హుండీల్లో నగదు ఎక్కువగానే ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు.
టీడీపీ నాయకుడిపై దాడి
● బయటపడిన విభేదాలు
భామిని: మండలంలోని టీడీపీ నాయకుల్లో విభేదాలు భగ్గుమన్నాయి. పాలకొండ ఎమ్మల్యే నిమ్మక జయకృష్ణ, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ పడాల భూదేవి వర్గాలు ఒకరిపై ఒకరు పోటీ దాడులకు దిగుతున్నారు. ఈ మేరకు ఆదివారం భామిని మండలం సొలికిరికి చెందిన టీడీపీ నాయకుడు బర్ల ఆనందరావుపై అదే గ్రామానికి చెందిన టీడీపీ మరో నాయకుడు కొత్తకోట గోవిందరావు కుటుంబం దాడి చేసి గాయపరిచిందని బత్తిలి పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. పార్టీ వ్యవహారాలు మాట్లాడదమని చెప్పి ఇంటికి పిలిచి టీడీపీ నాయకుడు కొత్తకోట గోవిందరావుతో పాటు కుటుంబసభ్యులు తనను బెదిరించి దాడి చేసినట్లు బాధితుడు బర్ల ఆనందరావు వాపోతున్నాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి బాధితుడిని ఎంఎల్‌సీకి తరలించినట్లు బత్తిలి ఎస్సై అప్పారావు తెలిపారు.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో పెంకుటిల్లు దగ్ధం


