రైతుబజార్ నిర్మాణానికి రెండోసారి శంకుస్థాపన..!
భోగడాపురం: అదేదో సినిమాలోని డైలాగ్‌లా చెల్లికి పెళ్లి జరగాలి మళ్లీమళ్లీ అన్నట్లు మండల కేంద్రం భోగాపురంలో జాతీయ రహదారిని అనుకుని 50 సెంట్ల విలువైన స్థలంలో రైతు బజార్‌ను ఏర్పాటు చేసేందుకు మరోసారి శంకుస్థాపన చేయనున్నారు. గతంలో మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు చొరవ తీసుకుని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ ద్వారా సుమారు రూ.74 లక్షలు నిధులను మంజూరు చేయించి రైతుబజార్‌ను తీసుకువచ్చారు. ఈ మేరకు 2022 జూన్ 16వ తేదీన అప్పటి ఎంపీ బెల్లానచంద్రశేఖర్, ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్‌బాబుతో కలిసి మాజీ ఎమ్మెల్యే అప్పలనాయుడు శంకుస్థాపన నిర్వహించగా పనులు ప్రారంభమయ్యాయి. అయితే ఇంతలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో పనులు నిలిచిపోగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన కూటమి ఎమ్మెల్యే లోకం నాగమాధవి తిరిగి మళ్లీ అదే రైతుబజార్‌కు శంకుస్థాపన చేయనున్నారు. శంకుస్థాపన చేసిన దానికి రెండోసారి శంకుస్థాపన చేయడమేంటని మండలలోని ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రైతుబజార్ పనులను తనకు సంబంధించిన కాంట్రాక్టర్లకు ఇచ్చుకునేందుకే మళ్లీ శంకుస్థాపన నిర్వహిస్తున్నారని మండలంలోని పలువురు నాయకులు గుసగుసలాడుకుంటున్నారు.


