ప్లానింగ్ కార్యదర్శుల నూతన కార్యవర్గం
విజయనగరం: ఉమ్మడి విజయనగరం జిల్లా పరిధిలో విధులు నిర్వహిస్తున్న వార్డు ప్లానింగ్ కార్యదర్శులు టెక్నికల్ అసోసియేషన్ నూత న కార్యవర్గ ఎన్నిక ఆదివారం ఏకగ్రీవంగా జరిగింది. విజయనగరంలో జరిగిన ఎన్నికలో నూతన అధ్యక్షునిగా విజయనగరానికి చెందిన పి.శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శిగా బొబ్బిలికి చెందిన ఎం.రాజేష్, మహిళా అధ్యక్షురాలిగా సాలూరుకు చెందిన వై.ప్రియాంక, కోశాధికారిగా విజయనగరానికి చెందిన వి.మణికంఠ, ఉపాధ్యక్షునిగా నెల్లిమర్లకు చెందిన జి.అశోక్‌కుమార్ ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గాన్ని వార్డు ప్లానింగ్ కార్యదర్శులు అభినందించారు.
బొబ్బిలి రూరల్: అంతర్రాష్ట్ర రహదారిపై పారాది గ్రామం వద్ద వేగావతి నదిపై తాత్కాలిక కాజ్‌వే మీదుగా వరద నీరు ప్రవహిస్తోంది. ఆదివారం ఆర్డీవో జేవీవీ రామ్మోహనరావు కాజ్‌వేపై వరదనీటి ఉధృతిని తహసీల్దార్ శ్రీనుతో కలసి పరిశీలించారు. రానున్న మూడు రోజుల పాటు మోంథా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కాజ్‌వేపై మరింతగా వరద నీరు వచ్చిచేరుతుందని, విశాఖ – రాయఘడ్‌ల మధ్య ప్రయాణించే వాహనాలను దారి మళ్లించాలని పోలీసులకు, ఆర్‌అండ్‌బీ అధికారులకు సూచించారు. రామభద్రపురం నుంచి రాజాం మీదుగా రాయఘడ వైపుగా వాహనాలు వెళ్లాల్సి ఉందని, పార్వతీపురం నుంచి ఖడ్గవలస మీదుగా విజయనగరం చేరేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు వాహనాలను ఆయా రహదారుల్లోనే ప్రయాణించేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని సూచించారు. వారి వెంట ఆర్‌ఐ రామకుమార్ సిబ్బంది ఉన్నారు.
విజయనగరం అర్బన్: జిల్లాలోని విద్యా శిక్షణా సంస్థల్లో లెక్చరర్ పోస్టుల భర్తీ చేయడానికి పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. జిల్లా పరిషత్, మున్సిపాల్ పాఠశాలల్లో పని చేస్తున్న అర్హత గల స్కూల్ అసిస్టెంట్‌లను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా త్రీమెన్ కమిటీ ఎంపిక చేస్తుంది. ఈ మేరకు ఎంపిక ప్రక్రియ షెడ్యూల్‌ను డీఈవో యూ.మాణిక్యంనాయు డు విడుదల చేశారు. ఇప్పటికే ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 29వ తేదీ వరకు కొనసాగుతుంది. ఇంతవరకు గూగుల్ ఫారం ద్వారా దరఖాస్తులు స్వీకరించినప్పటికీ ఇకపై లీప్ యాప్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గతంలో గూగుల్ ఫారం ద్వారా అప్‌లోడ్ చేసిన వారు కూడా మళ్లీ లీవ్ యాప్ ద్వారా సబ్మిట్ చేయాలి. ఆ యాప్‌లోని లింక్ ద్వారా అప్లికేషన్ ఫారమ్ డౌన్‌లోడ్ చేసుకుని సంబంధిత అధికారిచే కౌంటర్ సైన్ చేయించి జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి సమర్పించాలి. దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ అక్టోబర్ 30, 31 తేదీల్లో జరుగుతుంది. నవంబర్ 5 నుంచి 8వ తేదీ వరకు ఆరు సెషన్లలో రాత పరీక్ష నిర్వహిస్తారు. ఫలితాలు నవంబర్ 13న విడుదల చేస్తారు. వచ్చే నెల 14, 15 తేదీల్లో త్రీమెన్ కమిటీ ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ మార్కుల ఆధారంగా ఎంపికై న వారికి ఉత్తర్వులు నవంబర్ 18న జారీ చేస్తారు. ఎంపికై న అభ్యర్థులు నవ ంబర్ 19న సంబంధిత డైట్‌లో డిప్యూటేషన్‌పై చేరాలి. 31 అక్టోబర్ 2025 నాటికి 58 సంవత్సరాలు మించకూడదని కనీసం 5 సంవత్సరాల స్కూల్ అసిస్టెంట్ సేవలు పూర్తి చేయాల్సి ఉంటుందని ప్రకటించారు.
గరుగుబిల్లి: నాగావళి నది నీటి ప్రవాహం తోటపల్లి ప్రాజెక్టు వద్ద నిలకడగా ఉంది. ఆదివారం సాయంత్రానికి నది పైభాగం నుంచి 3,521 క్యూసెక్కుల నీటి ప్రవాహం రాగా ఈ మేరకు అధికారులు 5,500 క్యూసెక్కల నీటిని నదిలోకి విడిచిపెట్టారు. అలాగే కాలువల ద్వారా 100 క్యూసెక్కుల నీటిని విడిచి పెడుతున్నారు. మోంథా తుఫాను కారణంగా ప్రాజెక్టు వద్ద నీటి పరిస్థితిని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు ఇరిగేషన్ అధికారులు తెలియజేస్తున్నారు.


