తీరప్రాంతంలో తస్మాత్..
వలలు, బోట్లు సురక్షిత ప్రాంతాలకు తరలించాలి
మత్స్యశాఖ డి.డి విజయకృష్ణ
పూసపాటిరేగ : మోంథా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారడంతో తీర ప్రాంత మత్స్యకారులు అప్రమత్తంగా వుండాలని మత్స్య శాఖ డి.డి. ఎం.విజయకృష్ణ సూచించారు. సముద్రాన్ని ఆనుకొని నిలిపి వు న్న విలువైన బోట్లు, వలలు సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు సూచించారు. ఆస్తి, ప్రాణ నష్టాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశించారు. ప్రధానంగా తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా వుండాలని కోరారు. తీరప్రాంత గ్రామాలైన చింతపల్లి, పతివాడబర్రిపేట, తమ్మయ్యపాలెం, పులిగెడ్డ, తిప్పలవలస, కోనాడ, ముక్కాం, చేపలు కంచేరు, కొండ్రాజుపాలెం గ్రామాలలో మత్స్యకారులను అప్రమత్తం చేయడంతో పాటు గ్రామాలలో ఇప్పటికే దండోరా వేసి అప్రమత్తం చేసినట్టు తెలిపారు. తీరప్రాంత గ్రామాలలో వీఆర్‌వోలను అక్క డే స్థానికంగా వుంచి అప్రమత్తత చేయిస్తున్నట్లు పూసపాటిరేగ తహసీల్దార్ ఎన్‌వి.రమణ తెలిపారు.


