ఆ గ్రామాలు.. రికార్డులకే పరిమితం
● భౌతికంగా కనిపించని శ్రీహరిపురం, మొదటి కెల్ల..
● భూముల క్రయ, విక్రయాల్లో మాత్రం కొనసాగుతున్న ఆయా గ్రామాల పేర్లు
● ఆ రెండు గ్రామాల్లో 647 ఎకరాల్లో విస్తరించి ఉన్న భూములు
వీరఘట్టం: భౌతికంగా ఆ ఊళ్లు మనకు కనిపించవు. ఇంకా చెప్పాలంటే ఆ గ్రామాలు ఉన్నట్లు స్థానికులకే తెలియదు. రెవెన్యూ రికార్డుల్లో మాత్రం భద్రంగా ఉన్నాయి. భూముల క్రయ,విక్రయాలు.. రిజిస్ట్రేషన్లు వంటి కార్యకలాపాలన్నీ వాటి పేరిటే కొనసాగుతున్నాయి. మండలంలోని చిట్టపులివలస సచివాలయం పరిధిలో విక్రమపురం, చిట్టపులివలస, శ్రీహరిపురం, మొదటి కెల్ల రెవెన్యూ గ్రామాలున్నాయి. అయితే మొదటి రెండు గ్రామాల్లో వేల సంఖ్యలో జనాభా కూడా నివసిస్తున్నారు. అయితే మిగిలిన రెండు గ్రామాలైన శ్రీహరిపురం, మొదటికెల్లలకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ గ్రామాలు ఉన్నట్లు ఎక్కడా కనపడవు. కానీ రికార్డుల్లో మాత్రం ఈ ఊరు పేర్లు కొనసాగుతున్నాయి. బ్రిటిష్ కాలంలో ఈ రెండు గ్రామాలు అగ్రహారాలుగా ఉండేవని.. వందేళ్ల కిందటి వరకు ఆయా గ్రామాల్లో ప్రజలు ఉండేవారని.. కాలక్రమేణా వారు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవడంతో ఊళ్లు ఖాళీ అయ్యాయని పెద్దలు చెబుతున్నారు. అయితే అధికారికంగా ఇప్పటికీ రికార్డుల్లో మాత్రం ఆ ఊర్లు ఉన్నాయి.
ఇదీ విషయం..
వీరఘట్టం మండలంలో 41 రెవెన్యూ గ్రామాలున్నాయి. వీటిలో అన్ని గ్రామాలు భౌతికంగా ఉన్నప్పటికీ శ్రీహరిపురం, మొదటికెల్ల గ్రామాలు మాత్రం కనుమరుగయ్యాయి. ఈ రెండు గ్రామాలు నడుకూరు, చిట్టపులివలస, విక్రమపురం, నడిమికెల్ల గ్రామాల మధ్యలోనే ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. శ్రీహరిపురం పరిధిలో సుమారు 280 ఎకరాలు.. మొదటి కెల్ల పరిధిలో 367 ఎకరాలకు పైగా భూములున్నాయి. ప్రస్తుతం నడుకూరు పాలకేంద్రం నుంచి విక్రమపురం వరకు, చిట్టపులివలస గ్రామానికి సమీపంలో ఉన్న చింతచెట్టు నుంచి విక్రమపురం వరకు ఉన్న భూములన్నీ శ్రీహరిపురం రెవెన్యూ పరిధిలోనే ఉన్నాయి. అలాగే విక్రమపురం దాటిన తర్వాత నడిమికెల్ల ముందర వరకు.. విక్రమపురం నుంచి సమీపంలో ఉన్న నాగావళి నది వరకు ఉన్న భూములు మొదటికెల్ల రెవెన్యూ పరిధిలో ఉన్నాయి.
ఆ పేర్లతోనే రిజిస్ట్రేషన్లు..
ప్రస్తుతం నడుకూరు, విక్రమపురం, చిట్టపులివలస గ్రామస్తుల భూములన్నీ శ్రీహరిపురం, మొదటికెల్ల రెవెన్యూ పరిధిలోనే ఉన్నాయి. మీ భూమి పోర్టర్‌లోనూ ఇవే కనిపిస్తాయి. ఆ ప్రాంతాల్లోని భూముల క్రయ,విక్రయాలు, రిజిస్ట్రేషన్లు అన్నీ పాత గ్రామాల పేరిటే కొనసాగుతున్నాయి.
647 ఎకరాల భూములున్నాయి..
మండలంలోని శ్రీహరిపురం, మొదటికెల్ల రెవెన్యూ గ్రామాలు భౌతికంగా లేవు. అయితే రెవెన్యూ రికార్డుల్లో మాత్రం ఈ గ్రామాలున్నాయి. ఈ రెండు గ్రామాల్లో 647 ఎకరాల భూములున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా ఇవే పేర్ల మీద వస్తున్నాయి. – ఏఎస్ కామేశ్వరరావు, తహసీల్దార్, వీరఘట్టం
ఆ గ్రామాలు.. రికార్డులకే పరిమితం
ఆ గ్రామాలు.. రికార్డులకే పరిమితం


