మహిళలకు అండగా...
విజయనగరం ఫోర్ట్: సమాజంలో మహిళల పట్ల వేధింపులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వివాహం కాని వారికి ఆకతాయిల నుంచి వేధింపులు ఎదురువుతున్నాయి. వివాహమైన వారికి భర్త, అత్తమామలు, ఇతర కుటుంబ సభ్యుల నుంచి వేధింపులు తప్పడం లేదు. గృహహింస భరించలేక ఎంతో మంది గృహిణిలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. మరి కొంతమంది ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారు. ఇటువంటి మహిళలకు రక్షణగా, అండగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం గృహహింస నిరోధక చట్టాన్ని తీసుకొచ్చింది. ఆదివారం గృహహింస నిరోధక చట్టం దినోత్సవం సందర్బంగా సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం. 2006 ఆక్టోబర్ 26న గృహహింస నిరోధక చట్టం అమల్లోకి వచ్చింది.
గృహహింస..
మహిళను కొట్టడం, కొరకడం, తన్నడం, బలంగా గెంటడం లేదా శారీరకంగా నొప్పిని కలిగించడం ఇలా ఏవిధంగా గాయపరిచినా గృహహింస కిందకే వస్తుంది.
లైంగిక హింస..
మహిళతో బలవంతపు లైంగిక సంభోగం, బిడ్డల మీద లైంగిక దాడులు, అశ్లీలమైన చిత్రాలను చూడమని బలవంతం చేయడం, సీ్త్రల గౌరవాన్ని కించపరిచేలా వ్యవహరించడం లైంగికహింస కిందకు వస్తుంది.
ఆర్థిక హింస..
మనోవర్తి, ఆహారం, దుస్తులు, మందులు మొదలైనవాటికి డబ్బు ఏర్పాటు చేయకపోవడం.. పని, ఉద్యోగం, ఇంటి నుంచి నిరోధించడం.. సంపాదనను తీసుకొని పోవడం.. గృహ సంబంధ వస్తువులను ఉపయోగించకుండా అడ్డుకోవడం ఆర్థికహింస కిందకు వస్తుంది.
ఉద్వేగపూరిత హింస..
మహిళ ప్రవర్తన మీద ఆరోపణులు, పిల్లలు లేరని అవమానించడం, వరకట్నం తీసుకురాలేదని వేధించడం, విద్య, ఉద్యోగం చేయకుండా నిరోధించడం, మనుషులతో కలవనివ్వకపోవడం, ఇంకో పెళ్లి చేసుకుంటానని బెదిరించడం, ఆత్మహత్య చేసుకుంటానని రెచ్చగొట్టడం ఉద్వేగపూరిత హింస కిందకు వస్తుంది.
గృహహింస విభాగం వారు అందించే సహాయం..
గృహహింసకు గురయ్యే మహిళలకు అండగా అవసరమైన రక్షణ, సంరక్షణ, వైద్య, న్యాయసహాయాన్ని అందించేందుకు కలెక్టరేట్‌లోని ఐసీడీఎస్ కార్యాలయంలో గృహహింస నిరోధక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అధీనంలో పనిచేస్తుంది. ఇందులో ఒక లీగల్ కౌన్సిలర్, సోషల్ కౌన్సిలర్ , ఒకడేటా ఎంట్రీ ఆపరేటర్ ఇద్దరు హోం గార్డులుంటారు. గృహహింసకు గురైన మహిళలకు అవసరమైన వైద్య సహాయాన్ని అందించడం, ప్రతివాది నుంచి రక్షణ కల్పించడం, భార్యాభర్తలిద్దరికి కౌన్సెలింగ్ నిర్వహించడం, అవసరమైతే న్యాయ సహాయం చేయడం చేస్తారు.
1047 కేసుల నమోదు..
2006 నుంచి ఇప్పటివరకు జిల్లాలో 1047 గృహహింస కేసులు నమోదయ్యాయి. ఇందులో కౌన్సెలింగ్ ద్వారా 324 కేసులు పరిష్కరించారు. 723 కేసులకు సంబంధించి నివేదికలను వివిధ కోర్టుల్లో పొందుపరిచారు. ఇందులో 150 కేసుల్లో భార్యాభర్తలు కలిసి ఉంటామని అంగీకరించారు. 404 కేసులకు రక్షణ, జీవన భృతి, గృహ వసతి, నష్ట పరిహార ఉత్తర్వులు వచ్చాయి. 169 కేసులు వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి.
గృహహింస నిరోధక చట్టంతో
అతివలకు రక్షణ
నేడు గృహహింస నిరోధక చట్టం దినోత్సవం
2006 నుంచి ఇప్పటివరకు 1047 కేసుల నమోదు
కౌన్సెలింగ్ ద్వారా 324 కేసుల పరిష్కారం
కౌన్సెలింగ్ ఇస్తాం..
గృహహింస విభాగాన్ని అశ్రయించిన వారికి ముందుగా కౌన్సెలింగ్ నిర్వహిస్తాం. కలిసి ఉండడం వల్ల కలిగే ప్రయోజనాలు గురించి వివరించి సాధ్యమైనంతవరకు భార్యాభర్తలను కలపడానికి ప్రయత్నిస్తాం. అప్పటికీ అంగీకరించకపోతే గృహహింసకు గురైన మహిళ తరఫున కోర్టులో కేసు ఫైల్ చేస్తాం.
జి. రజని, సోషల్ కౌన్సిలర్
మహిళలకు అండగా...


