సమన్యాయం అందరి హక్కు..
● డీఎల్‌ఎస్‌ఏ సేవలను వినియోగించుకోవాలి
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత
● టోల్ ఫ్రీ నంబర్ 15100 ద్వారా ఉచిత న్యాయ సహాయం: కలెక్టర్ రాంసుందర్‌రెడ్డి
విజయనగరం అర్బన్: సమన్యాయం పొందడం రాజ్యాంగం మనందరికీ కల్పించిన హక్కు అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత అన్నారు. ఎస్సీ, ఎస్టీలు, నిరుపేదలు, మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు, తదితర వర్గాలకు చెందిన వారికి ఉచిత న్యాయసహాయం అందించే అవకాశాన్ని జిల్లా న్యాయసేవాధికార సంస్థ అందిస్తోందని చెప్పారు. జాతీయ న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ, జిల్లా అధికార యంత్రాంగం సంయుక్తంగా శనివారం స్థానిక కలెక్టరేట్ ఆడిటోరియంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆదాయం రూ.3 లక్షల కంటే తక్కువ ఉన్న పేదలు, మహిళలు, వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులు, తదితర బలహీన వర్గాలకు చెందిన వారు డీఎల్‌ఎస్‌ఏని సంప్రదించవచ్చన్నారు. ఆర్థిక లేదా ఇతర వైకల్యాల కారణంగా ఏ ఒక్కరూ న్యాయం పొందే అవకాశాన్ని కోల్పోకూడదన్నదే ఈ చట్టం ప్రధాన ఉద్దేశమని చెప్పారు. ఉచిత న్యాయ సహాయాన్ని అందించడం.. లోక్‌అదాలత్‌లు నిర్వహించడం.. న్యాయ అవగాహన శిబిరాలు ఏర్పాటు చేయడం.. బాధితులకు అండగా నిలవడం న్యాయసేవాధికార సంస్థ లక్ష్యమన్నారు.
ఉచిత న్యాయ సహాయం
కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి మాట్లాడుతూ.. డీఎల్‌ఎస్‌ఏను నేరుగా సంప్రదించడం ద్వారా లేదా టోల్ ఫ్రీ నంబర్ 15100కు ఫోన్ చేయడం ద్వారా కూడా న్యాయ సహాయాన్ని పొందే అవకాశం ఉందన్నారు. ఈ అవకాశాన్ని బాధితులు వినియోగించుకోవాలని సూచించారు. మండల, గ్రామ స్థాయిల్లో కూడా న్యాయ సేవాధికార సంస్థ సేవలపై అవగాహన కల్పించాలని కోరారు. ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ.. ప్రతి వ్యక్తికీ రాజ్యాంగం కొన్ని హక్కులు కల్పించిందని, వాటికి ఉల్లంఘన కలిగినప్పుడు పరిరక్షించడానికి వివిధ చట్టాలు ఉన్నాయని తెలిపారు. విస్తృతంగా పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం, సోషల్ మీడియా వల్ల మంచితో పాటు కొంత చెడుకూడా ఉందన్నారు. పోక్సో చట్టం ద్వారా రాష్ట్రంలోనే అత్యధికంగా మన జిల్లాలోనే సుమారు 20 మంది దోషులకు శిక్ష పడిందని తెలిపారు. అనంతరం వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ప్రదర్శనను సందర్శించారు. మిషన్ పథకంపై మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ప్రచురించిన బ్రోచర్లను ముఖ్య అతిథులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో జేసీ సేథుమాధవన్, డీఆర్‌ఓ ఎస్.శ్రీనివాసమూర్తి, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కె. రవిబాబు, పలువురు న్యాయమూర్తులు, న్యాయాధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు.
సమన్యాయం అందరి హక్కు..


