తేనెటీగల దాడిలో 50 మందికి గాయాలు
నెల్లిమర్ల: తేనెటీగల దాడిలో 50 మందికి గాయాలైన సంఘటన నగర పంచాయతీలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలియజేసిన వివరాల ప్రకారం.. నాగుల చవితి సందర్భంగా విశ్వంబర స్కూల్ వద్ద పుట్టలో పాలు వేయడానికి భక్తులు బాణసంచా కాల్చడంతో చెట్టు మీద తేనే టీగలు ఒక్కసారిగా భక్తులపై దాడి చేశాయి. వెంటనే స్థానికులు, సీహెచ్‌సీ అభివృద్ధి కమిటీ సభ్యుడు మజ్జి రాంబాబు స్పందించి బాధితులను సామాజిక ఆస్పత్రికి తరలించారు.
దొంగతనంపై కేసు నమోదు
భోగాపురం: తన పొలంలో వేసిన ఫెన్సింగ్ పోల్స్ (23) పోయాయంటూ మండలంలోని తూడెం గ్రామానికి చెందిన గాలి అప్పారావు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై వి. పాపారావు శనివారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అప్పారావుకు బసవపాలెం రెవెన్యూ పరిధి సర్వే నంబర్ 63లో 33 సెంట్ల భూమి ఉంది. తనకున్న భూమి చుట్టూ వేసుకున్న ఫెన్సింగ్ పోల్స్‌ను గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారు. దీనిపై బాధితుడు అప్పారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
చెస్, యోగా, టేబుల్ టెన్నిస్ జిల్లా జట్ల ఎంపిక
బొబ్బిలి: స్థానిక సంస్థానం ఉన్నత పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ – 14, 17 బాల, బాలికల విభాగంలో చెస్, యోగా, టేబుల్ టెన్నిస్ జిల్లా జట్ల ఎంపికలు శనివారం చేపట్టినట్లు పీడీ ఎన్. వెంకటనాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏడు మండలాల నుంచి వచ్చిన సుమారు 200 మంది క్రీడాకారుల సామర్థ్యాలను పరీక్షించి క్రీడాకారులను ఎంపిక చేశామన్నారు. క్రీడాకారులకు స్థానిక ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల ఎండీఎం నిర్వాహకులు భోజన సదుపాయం కల్పించారన్నారు. కార్యక్రమంలో సంస్థానం ఉన్నత పాఠశాల హెచ్‌ఎం ఎం. సునీత, పలువురు పీడీలు పాల్గొన్నారు.
వివాహిత ఆత్మహత్య
విజయనగరం క్రైమ్: వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానిక టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. ఎస్సై కృష్ణమూర్తి తెలియజేసిన వివరాల ప్రకారం.. విజయనగరం పీవీజీ నగర్‌కు చెందిన పొన్నాడ శ్యామల (32)కు 13 ఏళ్ల కిందట రాజస్థాన్‌కు చెందిన చౌహాన్‌కపూర్ సింగ్‌తో అన్నవరంలో వివాహమైంది. అయితే పిల్లలు లేకపోవడంతో వీరిద్దరూ విడిపోయారు. అప్పటి నుంచి శ్యామల పీవీజీ నగర్‌లోని తల్లివారింటిలో ఉంటోంది. ఈక్రమంలో నగరంలోని ఓ దుస్తుల దుకాణంలో పనిచేస్తున్న సతీష్ అనే వ్యక్తితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కుటుంబ సభ్యులు వద్దని వారించినా అప్పటికే ఇద్దరు పిల్లలున్న సతీష్‌ను శ్యామల వివాహం చేసుకుంది. అక్కడకు కొద్ది రోజుల్లోనే మళ్లీ తల్లిగారింటికి వచ్చేసింది. పుట్టలో పాలుపోసేందుకు కుటుంబ సభ్యులందరూ శనివారం ఉదయం బయటకు వెళ్లగా.. శ్యామల ఇంటిలో ఆత్మహత్యకు పాల్పడింది. కొద్దిసేపటి తర్వాత ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులకు ఉరికి వేలాడుతున్న శ్యామల కనిపించింది. తమ కుమార్తె ఎందుకు ఆత్మహత్యకు పాల్పడిందో అర్థం కావడం లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఎస్సై కృష్ణమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తేనెటీగల దాడిలో 50 మందికి గాయాలు
తేనెటీగల దాడిలో 50 మందికి గాయాలు


