పాముకాటుతో మహిళ మృతి
గజపతినగరం: మండలంలోని కొనిశ గ్రామానికి చెందిన సూరెడ్డి అన్నపూర్ణ (47)పాము కాటుతో మృతిచెందింది. గురువారం జరిగిన ఈ సంఘటనపై గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం భర్త బుచ్చిబాబుతో కలిసి గ్రామం సమీపంలో ఉన్న గొడ్డు పొలంలో పత్తి ఏరేందుకు అన్నపూర్ణ వెళ్లింది. పత్తి ఏరుతుండగా ఆమెను పాము కరవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లి పోయింది. వెంటనే భర్త బుచ్చిబాబు, మేకలు మేపుతున్న మరో వ్యక్తి సహాయంతో గజపతినగరం ఏరియా ఆస్పత్రికి వైద్యం కోసం తరలించారు. వైద్యులు పరిక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పోస్ట్‌మార్టం కోసం విజయనగరం సర్వజన ఆస్పత్రికి మృతదేహాన్ని పోలీసులు తరలించారు.


