మహిళ ఆత్మహత్య
విజయనగరం క్రైమ్: విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి గొల్లపేట సమీప కొత్తకాపు పేటకు చెందిన గురమ్మ (58) గురువారం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కొత్తకాపుపేటకు చెందిన బాడితమాను గురమ్మ భర్త, ఇద్దరు పిల్లలతో కుటుంబం నెట్టుకొస్తోంది. మూడు నెలల క్రితం పొత్తి కడుపులో తీవ్రంగా నొప్పి వచ్చింది. డాక్టర్‌కు చూపించగా అపెండిసైటిస్ అని ఆపరేషన్ చేస్తే నయమవుతుందని చెప్పారు. కూలి పని చేసుకుని జీవనం సాగించే గురమ్మ ఆర్థిక స్థోమత లేక చికిత్స చేయించుకోలేదు. తరచూ పొత్తి కడుపులో నొప్పి రావడంతో భరించలేక, నయం చేయించేందుకు ఆర్థికభారం మోయలేక..భర్త తెచ్చిన కూలి డబ్బులతో ఇంట్లో సర్దలేక మనస్తాపం చెందిన ఆమె ఊరి చివరన పూరిపాకలో చీరతో ఉరేసుకుని ప్రాణం తీసుకుంది. భర్త రామునాయుడు ఇచ్చిన ఫిర్యాదుతో రూరల్ ఎస్సై అశోక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


