పంటలు ధ్వంసమవుతున్నా పట్టించుకోరా?
● ఏనుగుల బాధిత రైతుల ఆవేదన
కొమరాడ: ఏనుగుల గుంపు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్లడం లేదు, పంటలు పోతున్నా కనీసం ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బాధిత రైతులు వాపోతున్నారు. ఆరుగాలం కష్టపడి వేలాది రూపాయలు పెట్టబడి పెట్టి చెమటోడ్చి పండించిన పంట చేతికి వచ్చిన సమయంలో కళ్ల ముందే పాడవుతోందంటూ అన్నదాత అవేదన వ్యక్తం చేస్తున్నాడు. 2018లో వచ్చిన ఏనుగుల గుంపు ఈ ప్రాంతంలో వేలాది ఎకరాల్లో పంటనష్టం చేసినా కనీసం రూపాయి నష్టపరిహారం అందడం లేదని రైతులు వాపోతున్నారు, మంగళవారం రాత్రి కొమరాడ మండలంలోని కుమ్మరిగుంట పంచాయతీ రావికర్రవలస పరిధిలో షణ్ముఖ్ రెడ్డికి సంబంధించిన జామతోటలో ఉన్న మోటారుతో పాటు పైపులను ఏనుగులు ధ్వంసం చేశాయి. అలాగే వరి పంటను తొక్కి నాశనం చేయడంతో ఆ రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటికై నా అటవీ శాఖ అధికారులు స్పందించి ఏనుగులు గుంపును ఈ ప్రాంతం నుంచి తరలించి రైతులకు నష్టపరిహారం అందజేయాలని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు.


