గెడ్డల్లోని ఇసుక స్థానిక అవసరాలకు మాత్రమే...
● కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి
విజయనగరం అర్బన్: చిన్నచిన్న వాగులు, గెడ్డల్లోని ఇసుకను స్థానిక అవసరాలకు మాత్రమే తరలించాలని, ఇతర ప్రాంతాలకు తరలించేందుకు అనుమతి లేదని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి స్పష్టంచేశారు. జిల్లాలో ఎక్కడా ఇసుక అక్రమ రవాణా, తవ్వకాలు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇసుక తరలించేవారికి ఇచ్చే కూపన్లపై తప్పనిసరిగా తేదీ, పంచాయతీ కార్యదర్శి సంతకం ఉండాలన్నారు. యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరిపేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో థర్డ్ ఆర్డర్ రీచ్‌లు 48 ఉన్నాయని, రెండు స్టాకు పాయింట్లలో నాణ్యమైన ఇసుకను శ్రీకాకుళం జిల్లా నుంచి తెప్పించి అందుబాటులో ఉంచామని జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ వివరించారు. జిల్లాలో ఏడాదికి సుమారు 4 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అవసరం ఉంటుందని, ఆ మేరకు అందుబాటులో ఉంచుతున్నట్టు గనులశాఖ డీడీ సీహెచ్ సూర్యచంద్రరావు వివరించారు. కొత్తవలస వద్ద ఇసుక స్టాక్ పాయింట్ ప్రతిపాదన పెండింగ్‌లో ఉందన్నారు. సమావేశంలో డీటీసీ మణికుమార్, ఆర్డీఓలు డి.కీర్తి, రామ్మోహన్, ఆశయ్య, డీపీఓ మల్లికార్జునరావు, ఇరిగేషన్ ఈఈ వెంకటరమణ, పొల్యూషన్ ఈఈ సరిత, పలువురు తహసీల్దార్లు పాల్గొన్నారు.
డీఏ బకాయిల కోసం మరణించాలా?
● తక్షణమే డీఏ ఉత్తర్వులు సవరించాలి
● ఏపీటీఎఫ్ డిమాండ్
బొబ్బిలి: కూటమి ప్రభుత్వం నుంచి డీఏ బకాయిలు పొందాలంటే ఉద్యోగులు మరణించాలా? ఇదెక్కడి అన్యాయం? లేదంటే ఉద్యోగవిరమణ పొందాలా? ఇవెక్కడి నిబంధనలు అంటూ ఏపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ జేసీ రాజు ఆవేదన వ్యక్తంచేశారు. బొబ్బిలిలోని ఏపీటీఎఫ్ కార్యాలయంలో కార్యవర్గ సభ్యులతో కలిసి విలేకర్లతో మంగళవారం మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసి డీఏ బకాయిల జీఓలో 30–09–2025 నాటికి చెల్లించాల్సిన బకాయిలను ఉద్యోగ విరమణ చేసిన కాలంలో ఇస్తామని, ఒక వేళ చనిపోతే వారి వారసులకు అందజేస్తామని ప్రకటించడం దారుణమన్నారు. ఈ నిర్ణయం ఉద్యోగుల పట్ల ముమ్మాటికీ నిర్లక్ష్యమేనన్నారు. ఎలాంటి వివక్ష చూపకుండా వెంటనే జీఓ నంబర్లు 60, 61లను సవరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన 21 నెలల బకాయిలను వారి పీఎఫ్ ఖాతాలకు జమ చేయాలన్నారు. నాలుగు డీఏలు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ ఒక డీఏ ఇవ్వడమే దారుణమంటే, తిరిగి దానిని కూడా ఉద్యోగులు మరణించాక వారసులకు ఇస్తామని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. చర్చల్లో ఒకవిధంగా, జీఓలో మరోలా పేర్కొనడం ఉద్యోగ, ఉపాధ్యాయులను ప్రభుత్వం మోసం చేయడమేనన్నారు. సీపీఎస్ ఉద్యోగులకు, పింఛను దారులకు నగదు రూపంలో తక్షణమే డీఏ బకాయిలు చెల్లించాలన్నారు. ఆయన వెంట జీసీహెచ్‌జీ శర్మ, చిన్నారావు, యుగంధర్, తదితరులు ఉన్నారు.
6,120 క్యూసెక్కుల నీరు విడుదల
వంగర: మండలంలోని మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టులో వేగావతి, సువర్ణముఖి నదుల నుంచి 5 వేల క్యూసెక్కుల నీరు చేరుతోంది. ప్రాజెక్టులో 64.48 మీటర్ల మేర నీటిమట్టం నమోదుకావడంతో మంగళవాం రెండు గేట్లు ఎత్తి 6,120 క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచిపెట్టినట్టు ఏఈ నితిన్ తెలిపారు.
గెడ్డల్లోని ఇసుక స్థానిక అవసరాలకు మాత్రమే...
గెడ్డల్లోని ఇసుక స్థానిక అవసరాలకు మాత్రమే...


