అందని శుద్ధజలం.. ఆవేదనలో విద్యార్థిలోకం
● పాఠశాలల్లో మూలకు చేరిన
ఆర్వో ప్లాంట్లు
● ఇళ్లనుంచే తాగునీటిని తెచ్చుకుంటోన్న విద్యార్థులు
బొబ్బిలి రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న నిరుపేద, మధ్యతరగతి విద్యార్థులకు సమస్యలు చుట్టుముడుతున్నాయి. కనీస సదుపాయాలు అందడంలేదు. స్వచ్ఛమైన తాగునీరు కూడా అందని పరిస్థితి. గత ప్రభుత్వం నాడు–నేడు పనుల్లో భాగంగా పాఠశాలలకు ఆధునిక హంగులతో పాటు ఆర్వోప్లాంట్లను ఏర్పాటుచేసింది. విద్యార్థుల ఆరోగ్యమే పరమావధిగా స్వచ్ఛమైన తాగునీటిని అందించే ఏర్పాట్లు చేసింది. ప్రస్తుత ప్రభుత్వం వీటి నిర్వహణను గాలికొదిలేసింది. ఫలితం.. లక్షలాది రూపాయల ఖర్చుతో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్లు మూలకు చేరాయి. రామభద్రపురం మండలంలో 91 ప్రభుత్వ పాఠశాలలుండగా వాటిలో నాడు–నేడు పథకం కింద 41 ఆర్వోప్లాంట్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రస్తుతం దాదాపు అన్ని పాఠశాలల్లోని ఆర్వో ప్లాంట్లు మూలకు చేరాయి. మరమ్మతులకు గురైన వాటిని బాగుచేసేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడం, చిన్నచిన్న సాంకేతిక లోపాలను సైతం పట్టించుకోకుండా వదిలేయడంతో విద్యార్థులు ఇంటినుంచే నీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. విద్యార్థులకు తాగునీటిని అందించే విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఆర్వో ప్లాంట్లను వినియోగంలోకి తేవాలని కోరుతున్నారు.
అందని శుద్ధజలం.. ఆవేదనలో విద్యార్థిలోకం


