ప్రతిభ చూపినవారికే పట్టం
విజయనగరం: విద్యార్థి దశ నుంచే బాలబాలికల్లో క్రీడాసక్తిని పెంపొందించేందుకు ఏటా ఎస్‌జీఎఫ్ (స్కూల్ గేమ్స్ ఫెడరేషన్) పోటీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాదికి సంబంధించి నేరుగా జిల్లా స్థాయిలో నిర్వహించే ఎంపిక పోటీలు ప్రారంభించగా.. తాజాగా మండల స్థాయి నుంచి నిర్వహించాల్సిన ఎంపిక పోటీల ప్రక్రియను జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఖరారు చేసింది. ఫెడరేషన్‌కు చైర్మన్‌గా వ్యవహరిస్తున్న డీఈఓ షెడ్యూల్‌ను ప్రకటించారు. విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలను పెంపొందించడం, ఆటల్లో రాణించిన వారిని రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేయడం వీటి ముఖ్య ఉద్దేశం. ఈనెల 17 నుంచి మండల స్థాయి, అనంతరం డివిజన్ స్థాయి, అందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి జిల్లా స్థాయి పోటీలు నిర్వహిస్తామని డీఈఓ పేర్కొన్నారు. ఈ మేరకు ఎంఈఓలు, అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సర్క్యులర్ జారీ చేశారు.
మూడంచెల పద్ధతిలో ఇలా..
స్కూల్‌గేమ్స్ పోటీల్లో భాగంగా మొత్తం 50 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు. అండ్–14, 17 విభాగంలో 10వ తరగతి పాఠశాల విద్యార్థులకు మండల, జోనల్, జిల్లా స్థాయిల్లో విడతల వారీగా నిర్వహిస్తారు. ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, బ్యాడ్మింటన్, చెస్, యోగా, అథ్లెటిక్స్ క్రీడాంశాలకు మూడంచెలుగా పోటీలు నిర్వహించనున్నారు. మిగిలిన 43 క్రీడాంశాలకు జిల్లా స్థాయిలో నేరుగా పోటీలు నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తారు. మూడంచల్లో నిర్వహించే 7 క్రీడాంశాల్లో ముందుగా అన్ని మండలాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ చూపిన వారికి జోనల్ స్థాయి, అక్కడ నుంచి జిల్లా స్థాయి, తర్వాత ఉమ్మడి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయికి పంపిస్తారు. జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న వారికి ధ్రువపత్రాలు అందజేస్తారు. వీటితో వివిధ ఉద్యోగాలకు క్రీడా కోటా కింద 2శాతం రిజర్వేషన్ల సదుపాయం వర్తిస్తుంది.
నేటి నుంచి మండలస్థాయి స్కూల్‌గేమ్స్
ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు
డివిజన్, జిల్లా స్థాయిలో పోటీలు
మొత్తం 7 క్రీడాంశాల్లో జరగనున్న పోటీలు
షెడ్యూల్ ఖరారు చేసిన జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్
నేటి నుంచి మండల స్థాయి ఎంపికలు:
స్కూల్ గేమ్స్ క్రీడా పోటీల్లో భాగంగా ఉమ్మడి జిల్లాల పరిధిలోని 23 మండలాల్లో శుక్రవారం ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. మొత్తం 7 క్రీడాంశాల్లో నిర్వహించే ఎంపికల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ఆయా డివిజన్ కేంద్రాలైన విజయనగరం, చీపురుపల్లి, బొబ్బిలి ప్రాంతాల్లో ఎంపికలు నిర్వహిస్తారు. ఆ ఎంపికల్లో రాణించిన వారికి జిల్లా స్థాయిలో నిర్వహించే ఎంపికలకు అవకాశం కల్పించనుండగా.... జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి కె.గోపాల్, విజయలక్ష్మిలు తెలిపారు. అర్హత, ఆసక్తి గల క్రీడాకారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


