లైంగిక వేధింపులకు గురిచేసేవారిపై కఠిన చర్యలు
● ఎస్పీ దామోదర్
విజయనగరం క్రైమ్: మహిళలను లైంగిక వేధింపులకు గురిచేసేవారిపై కఠిన శిక్ష పడేలా కేసులు నమోదుచేయాలని ఎస్పీ దామోదర్ పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం పోలీస్ అధికారులతో నిర్వహించిన నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. దర్యాప్తులో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్, ఎన్‌డీపీఎస్, పోక్సో, అట్రాసిటీ, మిస్సింగ్, రోడ్డు ప్రమాదాలు, భూ వివాదాల పెండింగ్ కేసులను సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యమివ్వాలన్నారు. దర్యాప్తులో ఉన్న కేసులను డీఎస్పీలు, సీఐలు తరచూ సమీక్షించి, దర్యాప్తు అధికారులకు తగిన సూచనలు చేయాలన్నారు. గంజాయి వ్యాపారులపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. చట్టాలను గౌరవించే వారితో స్నేహపూర్వకంగా మెలగాలన్నారు. బెల్టు షాపులను పూర్తిగా నియంత్రించాలన్నారు. తాత్కాలిక అనుమతులు (లైసెన్సు) కలిగిన వ్యాపారులను బాణసంచావిక్రయాలకు అనుమతించాలని సూచించారు. వివిధ కేసుల్లో దర్యాప్తుపై పలు సూచనలు చేశారు. నేర సమీక్షా సమావేశంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, డీఎస్పీలు ఆర్.గోవిందరావు, జి.భవ్యారెడ్డి, ఎస్.రాఘవులు, పలువురు సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.


