భూసేకరణ వేగవంతం చేయాలి
విజయనగరం అర్బన్: ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి అసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని, దీనికి అవసరమైన నిధుల ప్రతిపాదనలను సమగ్ర ఫార్మేట్‌లో అందజేయాలని నీటిపారుదల శాఖ అధికారులను కలెక్టర్ ఎస్.రామ్‌సుందర్‌రెడ్డి ఆదేశించారు. తోటపల్లి, నారాయణపురం, తారకరామ తీర్థసాగర్, మడ్డువలస, తాటిపూడి, ఆండ్ర ప్రాజెక్టులపై నీటిపారుదల శాఖ అధికారులతో గురువారం సమీక్షించారు. చీఫ్ ఇంజినీర్/తోటపల్లి ప్రాజెక్టు ఇన్‌చార్జి సూపరింటెండెంట్ ఇంజినీర్ స్వర్ణకుమార్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా నీటిపారుదల ప్రాజెక్టుల స్థితిగతులను, పురోగతిని కలెక్టర్‌కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తోటపల్లి ప్రాజెక్టులో గజపతినగరం బ్రాంచ్ కెనాల్‌కు అవసరమైన భూసేకరణను సత్వరమే పూర్తిచేయాలని సూచించారు. ప్రాజెక్టులకు అనుబంధంగా ఉన్న 759 చెరువులు, నలబై చెక్‌డ్యామ్ పనులు ఉపాధిహామీ నిధులు రూ.8.6 కోట్లతో చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. సమావేశంలో ఎస్‌ఈలు ఆర్.అప్పారావు, సుధాకర్, ఈఈలు అప్పలనాయుడు, రమణ పాల్గొన్నారు.


