అందని బిల్లులు.. నిలిచిన పనులు
త్వరలో బిల్లులు చెల్లిస్తాం..
రామభద్రపురం: ప్రతీ ఇంటికీ తాగునీరు సరఫరా చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జల్‌జీవన్ మిషన్ పనులకు బిల్లుల బకాయిలు గుదిబండగా మారాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు 100 పనులకు రూ.40 కోట్ల బిల్లులు చెల్లింపులు నిలిచిపోయాయి. ఫలితం.. మూడునెలలుగా పనులు జరగడంలేదు. ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది.
చివరిదశలో నిలిచిన పనులు
చాలా గ్రామాల్లో జల్‌జీవన్ మిషన్ పనులు చివరి దశలో నిలిచిపోయాయి. తాగునీటి పథకాల నిర్మా ణాలు, బోర్ల ఏర్పాటు పూర్తయినా పైప్‌లైన్ పనులు జరగలేదు. దీంతో ఇంటింటికీ నీటి సరఫరా సా ధ్యం కావడంలేదు. తాగునీటి ట్యాంకులు దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయి. కొన్నిచోట్ల ట్యాప్‌లు ప్రారంభానికి ముందే పాడవుతున్నాయి.
ఈ చిత్రంలో కనిపిస్తున్న మంచినీటి ట్యాంకు రామభద్రపురం మండలం రావివలస పంచాయతీలోని ఎనుబరువు గిరిజన గ్రామంలోనిది. రూ.17.60 లక్షల అంచనా వ్యయంతో నిర్మించారు. 90 శాతం పైగా పనులు పూర్తయ్యాయి. మరో పది శాతం పనులు పూర్తిచేస్తే ఇంటింటికీ తాగునీరు అందుతుందని గ్రామస్తులు సంబర పడ్డారు. ప్రభు త్వం బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్ చివరిదశలో పనులు నిలిపివేశారు. ఫలితం.. గిరిజనులకు తాగునీరు అందని ద్రాక్షగా మారింది.
జల్‌జీవన్ మిషన్ బిల్లులు చెల్లించని మాట వాస్తవమే. జిల్లా వ్యాప్తంగా సుమారు 100 పనులకు దాదాపు రూ.40 కోట్ల మేర బిల్లులు చెల్లింపుకు సిద్ధం చేశాం. ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ కూడా చేశాం. త్వరలో బిల్లులు మంజూరయ్యే అవకాశం ఉంది. కాంట్రాక్టర్లతో మాట్లాడి చివరిదశలో నిలిచిన పనులను పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటాం.
– ఎస్.కవిత, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ,
విజయనగరం


