
మలిచర్ల గ్రామంలోని దిబ్బవాని చెరువు
ఈ చిత్రం చూశారా... విజయనగరం మండలం మలిచర్ల గ్రామంలోని దిబ్బవాని చెరువు గట్టును పొక్లెయిన్‌తో తవ్వేసి ట్రాక్టర్లతో ఇలా తరలించేస్తున్నారు. మలిచర్ల నుంచి ఎన్‌హెచ్–16కు వచ్చేదారిలో 10 ఎకరాల విస్తీర్ణంలో దిబ్బవాని చెరువు విస్తరించి ఉంది. దీని కింద 100 ఎకరాల ఆయకట్టు ఉంది. ఇటీవల చెరువులో పూడికలు తొలగించిన మట్టితో గట్టును పటిష్టం చేశారు. దీనిపై స్థానిక టీడీపీ నేతల కన్నుపడింది. అంతే... గట్టును పూర్తిగా తవ్వేసి ట్రాక్టర్లతో తరలించి సొమ్ముచేసుకుంటున్నారు.
రెవెన్యూ అధికారుల కళ్లముందే ఈ తతంగం జరుగుతున్నా పట్టించుకోవడంలేదంటూ గ్రామస్తులు, ఆయకట్టు రైతులు మండిపడుతున్నారు. అక్రమ తవ్వకాలతో చెరువుగట్టుపై ఉన్న విద్యుత్ స్తంభాలు ప్రమాదకర రీతికి చేరాయని వాపోతున్నారు. ఈ విషయపై వివరణ కోసం రెవెన్యూ అధికారులను ‘సాక్షి’ సంప్రదించగా స్పందించలేదు. – విజయనగరం