
విజయనగరంలో ఎన్‌ఐఏ సోదాలు
విజయనగరం క్రైమ్: ఉగ్రవాద భావజాలంతో అరెస్టయిన విజయనగరం జిల్లా కేంద్రంలోని ఆబాద్‌వీధికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్ కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ(ఎన్‌ఐఏ) బృందం దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాలోన్ని 16 చోట్ల మంగళవారం ఏకకాలంలో సోదాలు జరిపింది. అందులో భాగంగా విజయనగరం టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విచారణ చేపట్టింది. సిరాజ్‌కు సంబంధించిన పలు అంశాలపై జిల్లా పోలీస్ అధికారులను ప్రశ్నించింది. ఈ ఏడాది మే నెలలో ఎన్‌ఐఏ బృందం నగరంలోని ఆబాద్ వీధికి చెందిన సిరాజ్‌ను అదపులో తీసుకోవడం, ఆ తర్వాత స్థానిక పోలీసులు వారం రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారణ జరిపిన తర్వాత కోర్టులో హాజరుపర్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం విశాఖ సెంట్రల్ జైల్‌లో ఉంటున్న ఉగ్రవాది సిరాజ్ నుంచి ఎన్‌ఐఏ అధికారులు ఇప్పటికే వివరాలు రాబట్టారు.
డీఎస్సీలో రాణించిన క్రీడాకారులు
విజయనగరం: ఇటీవల విడుదలైన డీఎస్సీ ఫలితాల్లో రాష్ట్రానికి చెందిన 15 మంది పారా క్రీడాకారులు ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించారని పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవాధ్యక్షుడు కె.దయానంద్ తెలిపారు. స్థానిక విలేకరులతో ఆయన మంగళవారం మాట్లాడారు. ఈ విజయంతో దివ్యాంగ క్రీడాకారుల ఆత్మగౌరవం మరింతగా పెరిగిందన్నారు. రాష్ట్రంలో పారా క్రీడల అభివృద్ధికి గత పదేళ్లుగా నిరంతరం కృషిచేస్తున్న పారా స్పోర్ట్స్ అసోసియేషన్ అఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు గోనుగుంట్ల కోటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి వి.రామస్వామికి కృతజ్ఞతలు తెలిపారు.