
ఉద్యమానికి రంగం సిద్ధం..!
ఉద్యోగుల సహనాన్ని పరీక్షించొద్దు
గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది
నెలాఖరులోగా సమస్యలను పరిష్కరించాలి
న్యాయం జరగకుంటే విధుల బహిష్కరణే..
అక్టోబర్ 1 నుంచి పింఛన్ పంపిణీ, సర్వే విధులకు దూరం
జిల్లాలో 626 సచివాలయాల్లో 5,498 మంది సిబ్బంది
ఇప్పటికే క్షేత్ర స్థాయిలో నిరసనలు
వాలంటీర్ విధులను అప్పగించరాదు
విజయనగరం అర్బన్:
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ, పని చేస్తున్న ఉద్యోగులపై పాలకుల నిర్లక్ష్యం కనిపిస్తోంది. క్షేత్ర స్థాయిలో ఆ వ్యవస్థలో అందిస్తున్న సేవలను కనుమరుగు చేసే కుట్ర సాగుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే వాలంటరీ సేవలను రద్దు చేశారు. వారి విధులను సచివాలయ ఉద్యోగులకు బలవంతంగా అప్పగించి వారి సహనాన్ని కూటమి ప్రభుత్వం పరీక్షిస్తుంది. మరో వైపు సచివాలయ సిబ్బంది నిర్వహించాల్సిన విధులను తగ్గించకుండా గత ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటరీల పింఛన్ పంపిణీ తదితర విధులు కూడా నిర్వహించాలని తొలిత పై అధికారుల వినతి నేపథ్యంలో చేపట్టారు. ప్రస్తుతం వాటిని తప్పనిసరి చేస్తూ సచివాలయ సిబ్బందికి పనిభారం పెంచారు. దీనితో పాటు ఉద్యోగులకు న్యాయబద్దంగా దక్కాల్సిన నోషనల్ ఇంక్రిమెంట్లు విడుదల చేయకుండా ఏడాదిగా పెండింగ్‌లో ఉంచిన డిమాండ్‌లతో పాటు పని ఒత్తిడి తగ్గించాలని సచివాలయ సిబ్బంది డిమాండు చేస్తున్నారు. సెప్టెంబర్ నెలాఖరుకల్లా ప్రధాన డిమాండ్‌లను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు జేఎసీ (ఏపీజీడబ్ల్యూఎస్‌ఈ జేఏసీ) ఐక్యవేదిక ఇప్పటికే అల్టిమేటం జారీ చేసింది. లేదంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించింది. జిల్లాలో ఉన్న 626 సచివాలయాలో భర్తీ చేసిన 14 కేటగిరీల వార్డు, గ్రామ సచివాలయ సిబ్బంది 5,498 మంది ఉన్నారు.
సచివాలయ ఉద్యోగులు సర్వీస్‌లో చేరి ఆరు సంవత్సరాలు పూర్తయినా నోషనల్ ఇంక్రిమెంట్లు ఇప్పటికీ మంజూరు చేయలేదు. ఒకే కేడర్‌లో ఆరు సంవత్సరాలు పూర్తి చేసిన వారికి ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ ప్రకారం స్పెషల్ ఇంక్రిమెంట్ ఇవ్వాలన్న నిబంధన అమలు కాలేదు. పనిభారం.. అన్యాయమైన ఆదేశాలను ఉద్యోగులు ఎదుర్కొంటున్నారు. పండగలు, ఆదివారాలు, సెలవు దినాల్లోనూ తప్పనిసరి విధులు, ఇంటింటి సర్వేల వల్ల ఉద్యోగుల ఆత్మ గౌరవం దెబ్బతింటోంది. రోజువారీ లక్ష్యాలతో ఒత్తిడితో కుటుంబ జీవితం దూరమవుతోంది.
అనైతిక బదిలీల ప్రక్రియ. బదిలీల కోసం ప్రత్యేక నిబంధనలు రూపొందించి, స్టేషన్ సీనియారిటీ ఆధారంగా పారదర్శక విధానాన్ని అమలు చేయాలి. పే స్కేల్ అసమానతలు తొలగించి, కేడర్ అప్‌గ్రేడ్ చేయాలి.
కొన్నాళ్లుగా ప్రభుత్వ ఉన్నతాధికారులకు వినతిపత్రా లు సమర్చించినప్పటికీ తమ సమస్యలు పరిష్కరించకపోవడంతో ఉద్యోగులు విసుగు చెందారు. ప్రధానమైన ఆర్థిక, ఆర్థికేతర అంశాలపై చర్చ లు జరిపి న్యాయం చేయకపోతే రానున్న అక్టోబర్ 1 నుంచి పెన్షన్ పంపిణీతో సహా ఇతర సర్వేలు చేయం. బకాయిలు, రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు తక్షణమే చెల్లించాలి. సచివాలయ సిబ్బంది సహనాన్ని పరీక్షించవద్దు.
–మధుబాబు బూరాడ, రాష్ట్ర చైర్మన్,
ఏపీజీడబ్ల్యూఎస్‌ఈ జేఏసీ
వాలంటీర్ విధులను సచివాలయ ఉద్యోగులకు అప్పగించరాదు. డిపార్ట్ మెంట్ వారీగా నిర్ధిష్ట జాబ్ చార్ట్ పనులు మాత్రమే అప్పగించాలి. గ్రామ వార్డు సచివాలయం గొడుగులో ఉన్న అన్ని డిపార్ట్‌మెంట్లకు ఒకే బేసిక్ పేతో ప్రమోషన్లు ఇచ్చి, పీఆర్‌సీ స్లాబ్ వర్తింపజేయాలి. డిపార్డుమెంట్ల వారీగా మాతృ శాఖల్లో విలీనం చేయాలి. ప్రతి సంవత్సరం వచ్చే పీరియాడికల్ ఇంక్రిమెంట్ తక్షణమే అమలు చేయాలి.
–వెంపడాపు కాశినాయుడు, జిల్లా అధ్యక్షుడు, ఏపీజీడబ్ల్యూఎస్‌ఈ జేఏసీ

ఉద్యమానికి రంగం సిద్ధం..!

ఉద్యమానికి రంగం సిద్ధం..!

ఉద్యమానికి రంగం సిద్ధం..!