
మదిమదినా.. వైఎస్సార్
సాక్షినెట్‌వర్క్:మహానేత, దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి వర్ధంతిని జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ అభిమానులు మంగళవారం నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి, నివాళులర్పించారు. పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. అనాథాశ్రమాల్లో అన్నదానం చేశారు. వృద్ధులకు, ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
● తెలుగు జాతి ఉన్నంత వరకు వైఎస్సార్ జ్ఞాపకాలు పదిలమని జెడ్పీచైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. చీపురుపల్లి మండల పరిషత్ కార్యాలయం ఆవరణలోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
● బొబ్బిలి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోను వైఎస్సార్ వర్ధంతిని నిర్వహించారు. బలిజిపేట కూడలిలోని వైఎస్సార్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్సార్ అపర భగీరథుడని పేర్కొన్నారు.
● పేదల గుండెచప్పుడు వైఎస్సార్ అని వైఎస్సార్ సీపీ రాజాం ఇన్‌చార్జి డాక్టర్ తలే రాజేష్ అన్నారు. రాజాం మాధవబజార్ వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళలర్పించారు. ముఖ్యమంత్రిగా వైఎస్సార్ చేసిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.
● వైఎస్సార్ అంటే పేరు కాదని, పేదల సంక్షేమ సంతకమని, అభివృద్ధికి చిరునామా అని ఎస్.కోట మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అన్నారు. ఎస్.కోట పట్టణంలోని దేవీ కూడలిలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్సార్ సంక్షేమ పాలనను గుర్తుచేశారు.
● వైఎస్సార్ పాలన స్వర్ణయుగమని నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. నెల్లిమర్లలోని మొయిద, రామతీర్థం కూడళ్లలో ఉన్న రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలకు జెడ్పీటీసీ సభ్యుడు, పార్టీ మండలాధ్యక్షుడు గదల సన్యాసినాయుడు, పార్టీ పట్టణాధ్యక్షుడు చిక్కాల సాంబశివరావు, పార్టీ నాయకులతో కలిసి పూలమాలల వేసి నివాళులర్పించారు. సీహెచ్‌సీలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు.
● బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సంక్షేమ పాలనకు మూలకర్త దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అని మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. రైతు రుణాల మాఫీ, ఫీజురీయింబర్స్‌మెంట్, 108, 104 వంటి పథకాలతో ప్రజల గుండెల్లో గుడికట్టుకున్నారన్నారు. నగరంలోని సీఎంఆర్ కూడలి వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, పార్టీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్సార్ సేవలను గుర్తుచేశారు.

మదిమదినా.. వైఎస్సార్

మదిమదినా.. వైఎస్సార్

మదిమదినా.. వైఎస్సార్