
అంతా అయ్యగారి చేతిలోనే.. అమ్మగారు అలా వచ్చి వెళ్తారు అంతే..
బంగ్లాలో చెట్ల కింద అల్లాడిపోతున్న క్యాడర్
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఒరేయ్ పైడిరాజు ఇలాగైపోయిందేటిరా అన్నాడు సిమాచలం.. బంగ్లా వేపచెట్టు కింద ఎండాకులు నలుపుతూ.. ఏమైందిరా అంటూ ఆత్రుతగా దగ్గరకు జరుగుతూ అడిగాడు పైడిరాజు.. వెంటనే సిమాచలం మేధావిలా ఫోజెట్టి... ఏట్లేదురా... ఇప్పుడు మన ఎమ్మెల్యే ఉన్నారు కదా... ఆయమ్మ కూడా అచ్చం గూగుల్ చూసి కారు నడిపినట్లు స్టీరింగ్ మొత్తం ఆ జొన్నాడు రాజుకు ఇచ్చేసి ఈయమ్మ ఎనకసీట్లో రెస్ట్ తీసుకుంటున్నట్లు అనిపిస్తంది. ఈ రాజుకు అసలే డ్రైవింగ్ కొత్త.. జోరుమీద మన అమ్మిని ఏ గోతిలోలో, గుమ్మిలోనో తోసేట్టాడేమో అని నా అనుమానం అన్నాడు.. ఎండిపోయిన సమోసా ముక్క కొరుకుతూ.. ఒసే.. అలా ఆవుద్దంతావేంటి అన్నాడు పైడిరాజు.. ఎందుకవ్వదురా. పేనుకు పెత్తనం ఇస్తే బుర్రగోరక్కుండా ఉంటాదేటి.. దొంగోడికి తాళం ఇస్తే మాల్ లేపకుండా ఉంటాడేటి అన్నాడు సిమాచలం. అంటే ఏట్రా నాకు సమంగా అర్థం కాలేదు... మళ్లీ చెప్మి అన్నాడు పైడిరాజు. ఒరేయ్ నీకు ఇక్కడ కుర్చీలు సర్దడం తప్ప ఏం తెలీదురా అని ఎగతాళి చేస్తూనే సిమాచలం చెప్పడం మొదలెట్టాడు.
ఇప్పుడూ మనోళ్లు ఇదే బంగ్లాలో.. వేపచెట్ల కింద కుర్చీలు సర్దుతూ... వచ్చినోళ్లను పలకరిస్తూ పాతికముప్‌పై ఏళ్ల నుంచి ఉన్నోళ్లు ఉన్నారా? మరి అలాంటోళ్లను.. ఉమ్మడి జిల్లానేతలందర్నీ నేరుగా పిలిచి పలకరించే చనువున్న అలాంటి వాళ్లను పులుసులో ముక్కలా తీసేసి.. తమలపాకుకు.. కంపురొడ్డాకుకు తేడా కూడా తెలీని ఈ ఎంపీటీసీని నెత్తిన పెట్టుకోవడం ఏట్రా చిత్రం కాపోతే... అన్నాడు సిమాచలం. పోనీ ఎలా దొరికాడో దొరికాడు.. తెచ్చుకున్నారు. మొత్తానికి ఎమ్మెల్యే పదవి మొత్తం ఆయన కాలికాడా పెట్టేసినట్లు పెట్టేసి ఈయమ్మ రెస్ట్ తీసుకుంటే ఎలారా?. ఈ బంళ్లాను నమ్ముకుని ఎంతమంది ఉన్నారు. నగరంలో ఎంతమంది కార్యకర్తలు ఉన్నారు.. ఆళ్లంతా ఏమైపోవాలి.. అన్నాడు సింహాచలం. బాధ...కోపం...ఆవేదన... నిర్వేదం నిండిన భావనలతో.. యేటి అయిపోవడం... ఎందుకు అలా గింజుకుపోతన్నావు.. అంతా పీఏగారు చూసుకుంటున్నారు కదేటి అన్నాడు పైడి రాజు. దెబ్బకు సిమాచలానికి చిర్రెత్తుకొచ్చేసింది. ఒరేయ్ కెక్కున తన్నానంటే క్రోటన్ మొక్కల్లో పడతావు అన్నాడు సిమాచలం కోపంతో...
ఆయన పార్టీని చూసుకోవడం కాదురా.. పార్టీయే ఆయన్ను చూసుకుంటుంది. కాంట్రాక్టులు.. పేమెంట్లు.. బిల్లులు.. పనులు.. పైరవీలు అన్నీ ఆయనే చూస్తున్నాడ్రా బాబు.. మరైతే అమ్మగారు యేటి చేస్తారు అన్నాడు పైడిరాజు చిరాగ్గా మొకం పెట్టి.. ఒరేయ్ దరిద్రంగా మొకం పెట్టకు. మార్చు. చెబుతాను అంటూ మళ్లీ అందుకున్నాడు సిమాచలం. ఒరేయ్ నియోజకవర్గం మొత్తం ఆయన చేతిలోనే పెట్టేసింది అమ్మగారు. ఆయన నంది అంటే నంది.. పంది అంటే పంది.. అలాగైపోయింది ఆఖరుకు.. అన్నాడు సిమాచలం. పోన్లేరా అమ్మగారికి మంచి నమ్మకమైన పనోడు దొరికాడు అన్నాడు పైడిరాజు.
ఒరేయ్ బురత్రక్కువోడా ఆయన నమ్మకమైన పనోడు కాదనే కదా క్యాడర్ గోల.. ఆయన అమ్మకం.. ఏకంగా అమ్మగారి పరువును.. పార్టీ ప్రతిష్టను కూడా గంటస్తంభం కాడ అమ్మకానికి పెట్టేస్తున్నాడని కదా కార్యకర్తల బాధ.. అన్నాడు సిమాచలం. అంటే ముందొచ్చిన చెవులకన్నా.. ఎనకొచ్చిన.. అదేగా నీ బాధ అన్నాడు పైడిరాజు సమోసా ముక్క కింద పడేసి. ఆ అదే అదే.. నీ తెలివి ఉందిగానీ ఇలాగైతే ఎలాగరా.. అన్నాడు సిమాచలం.
ఏమీ కాదురా.. మొదట్లో బాధపడతారు.. ఆ తరువాత చిరాకు పడతారు.. ఆ ఎనక అలవాటుపడతారు.. ఇంకేటి కాదు అన్నాడు పైడిరాజు.. అంటే మొత్తానికి కార్యకర్తలు కష్టపడతారు.. ఇలాంటోళ్లు మధ్యలో వచ్చి సుఖపడతారు.. అంతేనా అన్నాడు సిమాచలం. అంతే.. అంతే .. కాపోతే రేపిల్లుండి జరిగే పంచాయతీ ఎన్నికల సంగతి ఈ బుడంకాయ పీఏ చూస్కుంటాడా..? క్యాడర్ను వదిలేసి ఈయమ్మ రాజకీయం ఎలా చేస్తుందో ఏటోరా అంతా సిరాగ్గా ఉంది అన్నాడు సిమాచలం. కాపోతే ఇది కూడా గూగుల్ చూసుకుని కార్లో వెళ్తున్నట్లే ఉంటాది. వెళ్లినంతకాలం బాగానే ఉంటాది కానీ ఏదోచోట ఆ కారు గోతిలోనో.. బ్రిడ్జి కాసి కిందకో పడిపోవడం మాత్రం గ్యారెంటీ.. దాన్నెవరూ ఆపలేరు.. అన్నాడు పైడిరాజు.
ఓరి ఓరి ఎంతమాట అన్నాడు సిమాచలం.. మరి కాదేటిరా .. ఎవలెవలికో అధికారం ఇచ్చేసి. ఎనకసీట్లో రిలాక్సయి కూకుంటే జర్నీ ఎలా ఉంటాది.. ఇలాగే ఉంటాది.. రాజకీయమైనా .. జీవితమైనా.. అన్నాడు పైడిరాజు.. ఓర్నీ నీలో తింగరితనమే ఉందనుకున్ను ఇంత తెలివి ఎక్కణ్ణుంచి వచ్చిందిరా అన్నాడు సిమాచలం.. ఇదిగో ఈ వేపాకులు నమిలే తెలివి పెంచుకున్నాను.. నువ్వూ నవులు .. నీకూ తెలివి పెరుగుద్ది అంటూ నాలుగు ఆకులు సిమాచలానికి ఇచ్చాడు.. ఓరి నీ తెలివికి దండంరా బాబు అంటూ అక్కణ్ణుంచి కదిలాడు.