
అధ్వాన రోడ్లే అభివృద్ధా?
సాలూరు: ప్రజాధనాన్ని ప్రచారాలకు దుర్వినియోగం చేయడం, ప్రతి మంగళవారం అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చడం, అధ్వానంగా కనిపిస్తున్న రోడ్లును బాగుచేయకపోవడమే కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి అని వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర విమర్శించారు. సాలూరు పట్టణంలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో రూ.3,32,000 కోట్లు అప్పులు చేస్తే 14 లక్షల కోట్లు అప్పులు చేసిందంటూ టీడీపీ నేతలు తప్పుడు ప్రచారాలు చేశారని, కూటమి ప్రభుత్వం 14 నెలల పాలనలో సుమారు 2 లక్షల కోట్లు అప్పులు చేశారని, దేశంలోనే అతి తక్కువ కాలంలో అత్యధిక అప్పులు తీసుకున్న రాష్ట్రంగా ఆంధ్రాను మార్చేశారన్నారు. ఇదేనా చంద్రబాబు సంపద సృష్టంటూ దుయ్యబట్టారు. 50 ఏళ్లు దాటిన ఎస్సీ, బీసీ, పేదలకు పింఛన్లు ఇస్తామన్న హామీని విస్మరించడం విచారకరమన్నారు. ఆడబిడ్డ నిధి కింద మహిళలకు ఇస్తామన్న నెలకు రూ.1500, నిరుద్యోగ భృతి కింద నిరుద్యోగ యువతకు నెలకు ఇస్తామన్న రూ.3 వేలు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు.
యూరియా ఏదీ..?
‘గణపతిబప్పమోరియా... ఏదయ్యా యూరియా’ అంటూ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న యూరియా కొరతపై సోషల్‌మీడియాలో వస్తున్న పోస్టులు ప్రభుత్వ వైఫల్యానికి అద్దంపడుతున్నాయని రాజన్నదొర అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంలోనే యూరియాకోసం రైతుల అగచాట్లు ప్రభుత్వ పాలనను ఎత్తిచూపుతున్నాయన్నారు. గత ప్రభుత్వంలో ఏ ఒక్క రైతు ఎరువుకోసం అవస్థలు పడిన దాఖలా లేవన్నారు. గత ప్రభుత్వ హయాంలోనే ఎయిర్‌పోర్టులు, సీపోర్టులు, ఆస్పత్రులు, సచివాలయ భవనాలు, విద్యాలయాల నిర్మాణాలు జరిగాయని గుర్తుచేశారు. కూటమి పాలనా వైఫల్యానికి రాష్ట్రంలో అధ్వానంగా దర్శనమిస్తున్న రోడ్లే నిలువెత్తు నిదర్శనమన్నారు. టీడీపీ నేతలు అవినీతిపై ఆ పార్టీ అనుకూల పత్రికలోనే ‘వసూళ్ల రాజాలు’ శీర్షికన కథనం వచ్చిందని పేర్కొన్నారు. అవినీతిపరుడు ముఖ్యమంత్రిగా ఉండకూడదని పవన్‌కల్యాణ్ చెప్పారని, చంద్రబాబునాయుడిపై 19 కేసులు ఉన్నాయని టీడీపీ అనుకూల పత్రికలోనే కథనం వచ్చిందని, మరి అవినీతిపరుడుకు పవన్‌కల్యాణ్ ఎలా మద్దతు ఇస్తారని ప్రశ్నించారు. ప్రశ్నిస్తానని చెప్పిన పవన్‌కల్యాణ్... సుగాలిప్రీతి విషయంలో ఎందుకు మాట తప్పారన్నారు. ఇచ్చిన హామీలను అమలుచేయని ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని ఓ అభిమానిగా తాను అడుగుతున్నానని అన్నారు. చంద్రబాబు, జగన్‌మోహన్‌రెడ్డిల పాలన మధ్య తేడాను ప్రజలు గుర్తించి సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు.
02ఎస్‌ఎల్‌ఆర్22: కూటమి ప్రభుత్వ పాలనా వైఫల్యాలను వివరిస్తున్న మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర