
సాగు భూమిని ఏపీఐఐసీకి ఎలా కేటాయిస్తారు..!
● తహసీల్దార్‌ను ప్రశ్నించిన కాకర్లవలస గిరిజన రైతులు
● పట్టా లేకుండా సాగు చేసే హక్కు లేదు..
● వదిలి వెళ్లిపోవాలని తేల్చి చెప్పిన తహసీల్దార్
రామభద్రపురం: డి పట్టా భూమి అయిన.. దశాబ్దాల కాలంగా మా సాగులో ఉన్న భూమిని ఏపీఐఐసీకి ఎలా కేటాయిస్తారని కాకర్లవలస గిరిజన రైతులు తహసీల్దార్ అజురఫిజాన్‌ను ప్రశ్నించారు. మండలంలోని కొట్టక్కి రెవెన్యూ, మిర్తివలస పంచాయతీ పరిధిలోని కాకర్లవలస, కారేడువలస గ్రామాల మధ్య 2017లో అప్పటి టీడీపీ ప్రభుత్వం సుమారు 187.08 ఎకరాల భూమిని రూ.7.48 కోట్లకు ఏపీఐఐసీకి విక్రయించింది. అయితే ఆ భూమిలో ఏపీఐఐసీ ఇప్పటి వరకు కనీసం ఒక్క పరిశ్రమ పెట్టలేదు సరికదా, భూమి ఎక్కడుందో? ఎలా ఉందో, ఎవరు ఆక్రమించుకున్నారో.. కనీసం కన్నెత్తి చూడలేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏపీఐఐసీకి సంబంధించిన భూమిలో ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటు కోసం కొంత భూమిని కేటాయిస్తూ ముందుగా రోడ్లు అభివృద్ధి కోసం రూ.7 కోట్లు నిధులు విడుదల చేయడంతో నెల రోజుల క్రితం మంత్రి కొడపల్లి శ్రీనివాపరావు, ఎమ్మెల్యే బేబీనాయన, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శంకుస్థాపన కూడా చేసిన విషయం విదితమే. అయితే సంబంధిత కాంట్రాక్టర్ ఇప్పుడు రోడ్లు అభివృద్ధి కోసం పనులు ప్రారంభించారు. ఈ క్రమంలో ఏపీఐఐసీకి సంబంధించిన భూమే కదా అని ప్రస్తుతం సాగులో ఉంటూ పత్తి, మొక్కజొన్న, మామిడి, జీడి తోటలు సాగు చేస్తున్న గిరిజన రైతులకు కనీసం నోటీసు ఇవ్వకుండా జేసీబీతో ధ్వంసం చేశారు. దాంతో తమ సాగులో ఉన్న భూములలో ఎలా రోడ్లు వేస్తారని వారు ప్రశ్నించారు. ఈ క్రమంలో తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ అజూరఫీజాన్ ఽఆధ్వర్యంలో ఏపీఐఐసీ జేఈ రాజేష్‌కుమార్, ఎస్‌ఐ వి.ప్రసాదరావు, మిర్తివలస సర్పంచ్ మజ్జి రాంబాబు, సీపీఎం నాయుకుడు బలస శ్రీనివాసరావు, గిరిజన రైతులు సమావేశమయ్యారు. సమావేశంలో భూ రికార్డులు పరిశీలించారు. తహసీల్దార్ మాట్లాడుతూ కాకర్లవలసలో ఉన్న మొత్తం సుమారు 462 ఎకరాల డి పట్టాతో పాటు, ఫారెస్టుకు సంబంధించిన భూమి ఉందని, అందులో గిరిజన రైతులకు 266 ఎకరాల భూమి ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలు కింద ఇచ్చామన్నారు. అలాగే 187.8 ఎకరాలు రూ.7.48 కోట్లకు ఏపీఐఐసీకి విక్రయించిందన్నారు. కొండ పక్కన ఉన్న ప్రాంతంలో మీకు ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలు ఇస్తే ఏపీఐఐసీకి కేటాయించిన భూమిలో మీరు ఎలా సాగు చేస్తారని? ఇది డి పట్టా భూమి అని మీరు సాగు చేస్తే కుదరదని, వదిలి వెళ్లిపోవల్సిందేనని తేల్చి చెప్పేశారు. భూమి ఎక్కడ ఇచ్చారో అక్కడకు వెళ్లి సాగు చేసుకోవాలని ఆదేశించారు. అనంతరం గిరిజన రైతులు మాట్లాడుతూ సాగులో ఉన్న భూములను ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటు అంటూ పెద్దల స్వార్ధం కోసం మా పేదల భూములు లాక్కోవడం సమంజసం కాదని ఆందోళన వ్యక్తం చేశారు. చావనైనా చస్తాం.. కానీ భూములు వదిలే ప్రసక్తి లేదని గిరిజన రైతులు తేల్చి చేప్పేశారు. మాకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. సర్పంచ్ మజ్జి రాంబాబు మాట్లాడుతూ మిర్తివలస పంచాయతీ పరిధిలో ఉన్న సర్పంచ్‌గాని, గ్రామ ప్రజల సంతకాలు లేకుండా కొట్టక్కి రెవెన్యూ పరిధిలో ఉన్నంత మాత్రాన ఆ సర్పంచ్ సంతకంతో తీర్మానం ఎలా చేస్తారు? నోటిఫికేషన్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. గిరిజన రైతులకు న్యాయం జరిగే వరకు వారికి మద్దతుగా తాము నిలబడతామన్నారు. మండల సర్వేయర్ వి.సాయికుమార్, కొట్టక్కి వీఆర్వో మహేష్, వైఎస్సార్‌సీపీ నాయకుడు భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

సాగు భూమిని ఏపీఐఐసీకి ఎలా కేటాయిస్తారు..!

సాగు భూమిని ఏపీఐఐసీకి ఎలా కేటాయిస్తారు..!