
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
రాజాం సిటీ: మండల పరిధి పొగిరి గ్రామ సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన శాసపు రమణ (59) మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు.. రమణ రాజాంలోని శ్రీకాకుళం రోడ్డులో గ్యాస్ ఏజెన్సీలో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. ఎప్పటిలాగే ఉదయం 7.30గంటల సమయంలో విధులకు టీవీఎస్ ఎక్సెల్‌పై బయలుదేరాడు. పొగిరి పీహెచ్‌సీ ఎదురుగా వచ్చేసరికి కళ్లు తిరగడంతో బైక్ అదుపుతప్పి ఒక్కసారిగా రోడ్డుపై పడిపోయాడు. ఈ ప్రమాదంలో తలకు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు పీహెచ్‌సీకి తీసుకువెళ్లారు. అక్కడ నుంచి 108 సహాయంతో రాజాం సామాజిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని చెప్పడంతో కుటుంబ పెద్దను కోల్పోయామని, తమకెవరు దిక్కని కుటుంబీకులు రోదించారు. మృతునికి భార్య సీతమ్మ, కుమారుడు చిరంజీవి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుని కుమారుడు చిరంజీవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ కె.అశోక్‌కుమార్ తెలిపారు.
కేరళలో కోన యువకుడు ఆత్మహత్య
మక్కువ: మండలంలోని కోన గ్రామానికి చెందిన మడక గోవర్ధనరావు( 30) కేరళ రాష్ట్రంలో గురువారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు..గోవర్ధనరావు కేరళ రాష్ట్రంలోని కాసరగోడ్ జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఏమైందో తెలియదుగాని తాను అద్దెకుంటున్న గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని మృతి చెందాడు. మృతికి గల కారణాలు తెలియరాలేదు. గోవర్ధనరావు మృతి చెందాడన్న వార్త తెలిసిన తల్లిదండ్రులు రామకృష్ణ, చిన్నమ్మలు కన్నీరుమున్నీరయ్యారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం