
పీఎం జన్‌మన్ గృహ నిర్మాణాలు వేగవంతం కావాలి
గుమ్మలక్ష్మీపురం: జిల్లాలో పీఎం జన్‌మన్ గృహ నిర్మాణాలు వేగవంతం కావాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ గృహ నిర్మాణ శాఖ అధికారులు, లబ్ధిదారులకు సూచించారు. గుమ్మలక్ష్మీపురం మండలంలోని కన్నయ్యగూడ, కురుపాం మండలంలోని తోటగూడ గ్రామాల్లోని పీఎం జన్‌మన్ ఇళ్లను గురువారం ఆయన పరిశీలించారు. ఇళ్ల నిర్మాణ ప్రగతిని పరిశీలించారు. బిల్లుల చెల్లింపులపై లబ్ధిదారులతో మాట్లాడారు. కన్నయ్యగూడ గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రం, ఎంపీపీ స్కూల్‌ను పరిశీలించారు. పాఠశాలకు అదనపు తరగతి గది మంజూరు చేస్తామన్నారు. అలాగే భద్రగిరి సీహెచ్‌సీని సందర్శించి వైద్యులకు పలు సూచనలు చేశారు. నిర్మాణ దశలో ఉన్న ఆసుపత్రి భవనాన్ని పరిశీలించారు. ఆపై గుమ్మలక్ష్మీపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, భద్రగిరి ఏపీటీడబ్ల్యూఆర్ గర్‌ల్స్ స్కూల్‌ను సందర్శించి మార్గదర్శకాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన గుమ్మలక్ష్మీపురంలో విలేకర్లతో మాట్లాడుతూ పీఎం జన్‌మన్ కింద జిల్లాకు 5వేల గృహాలు మంజూరు కాగా, 1600 గృహాలు వివిధ దశల్లో ఉన్నాయని, 130 గృహాలు పూర్తయ్యాయన్నారు. మిగిలిన గృహాలు డిసెంబర్ నెలాఖరులోగా పూర్తికావాల్సి ఉందన్నారు. అందులో భాగంగానే క్షేత్ర స్థాయి సమస్యలను తెలుసుకునేందుకు పర్యటించినట్టు చెప్పారు. భద్రగిరి సీహెచ్‌సీలో సీజనల్ వ్యాధులు, వైరల్ ఫీవర్స్ ఎక్కువగా నమోదవుతున్న తరుణంలో బెడ్లు సరిపోవడం లేదని, నిర్మాణ దశలో ఉన్న కొత్త ఆసుపత్రి భవనాలు త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించినట్టు తెలిపారు. బంగాళాఖాతంలో నెలకొన్న అల్పపీడనం వలన కలిగే తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు రెవెన్యూ, పోలీస్‌ల సహకారంతో ముందస్తు చర్యలు తీసుకున్నామని తెలిపారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లోని విద్యార్థులకు గ్రామ సచివాలయం ఏఎన్‌ఎం, ఎంపీహెచ్‌డబ్ల్యూలతో వైద్య సేవలందించడం జరుగుతుందన్నారు. ఆయన వెంట కేఆర్‌ఆర్‌సీ ప్రత్యేక ఉప కలెక్టర్ డా.పి.ధర్మ చంద్రారెడ్డి, ఐసీడీఎస్ పీడీ టి.కనకదుర్గ, ఐటీడీఏ డీడీ ఆర్.కృష్ణవేణి, గుమ్మలక్ష్మీపురం ఎంపీడీవో పి.త్రివిక్రమరావు, తహసీల్దార్ ఎన్.శేఖర్, ఎంఈవో బి.చంద్రశేఖర్, హౌసింగ్ డీఈ ఎం.వెంకటరావు తదితరులు ఉన్నారు.
కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్