
ఈగల్ టీమ్‌కు చిక్కిన గంజాయి నిందితులు
విజయనగరం క్రైమ్ : మూడు కార్లలో 120 కేజీల గంజాయిని రవాణా చేస్తున్న ఎనిమిది మందిని రాజాపులోవ జంక్షన్ వద్ద ఈగల్ టీమ్ ఆధ్వర్యంలో పట్టుకున్నట్టు ఎస్పీ వకుల్ జిందల్ వెల్లడించారు. డీపీవోలోని కాన్ఫరెన్స్ హాల్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈగల్ టీమ్ సీఐ కల్యాణితో కలిసి వివరాలు వెల్లడించారు. ఈగల్ పోలీసులకు అందిన కచ్చితమైన సమాచారంతో విజయనగరం నుంచి మూడు కార్లలో వస్తున్న ఎనిమిది మందిని రాజాపులోవ వద్ద అదుపులోకి తీసుకొని వారి నుంచి 47 ప్యాకెట్లలో ఉన్న 120 కేజీల గంజాయిని, తొమ్మిది సెల్‌ఫోన్లను సీజ్ చేశామన్నారు. పట్టుబడిన ఎనిమిది మంది నిందితుల్లో ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా లంతాపూర్ బ్లాక్ బెల్ట్‌కు చెందిన కొర్రా కిరణ్(21), మనోజ్ బిసాయి(2), ఢిల్లీలోని పాత సీంపూర్‌కు చెందిన పాజిల్(30), యూపీలోని హాపూర్ జిల్లా లక్ష్మణపురకు చెందిన బిజేంద్ర(46), బుదాన్ జిల్లా సక్రి జంగిల్‌కు చెందిన ముఖ్తర్ అహ్మద్(43), అహిర్వారాకు చెందిన రామ్మోహన్(21), కాశగాని జిల్లా కుల్లికి చెందిన సోను (34), శిల్పి(30)గా విచారణలో గుర్తించామన్నారు. నిందితులు గంజాయిని ఉత్తరప్రదేశ్, ఢిల్లీకు రవాణా చేయాలనే ఉద్దేశంతో ఒడిశా రాష్ట్రంకు చెందిన గంజాయి వ్యాపారులతో సంబంధాలు పెట్టుకున్నారని తెలిపారు. మరో నిందితుడు అజిత దడక అలియాస్ ఒజి అలియాస్ మహేష్ దడక పరారయ్యాడని, త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు. వీరంతా ఒడిశాలోని గంజాయి వ్యాపారుల వద్ద కొనుగోలు చేసి రైళ్లు, కార్లలో తరలించేందుకు ప్రణాళిక రూపొందించుకున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో కార్లలో విజయనగరం మీదుగా విశాఖపట్నం తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారన్నారు. వీరిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. గంజాయిని పట్టుకోవడంలో చురుగ్గా వ్యవహరించిన భోగాపురం సీఐ కె.దుర్గాప్రసాద్, ఈగల్ సీఐ టి.కల్యాణి, ఎస్‌ఐ పి.పాపారావు, ఇతర పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఆయనతో పాటు డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు పోలీసు అధికారులు ఉన్నారు.
పట్టుబడిన వారిలో యూపీకి చెందిన
దంపతులు