
మార్గదర్శుల కోసం బతిమలాట..!
● పేదోడి మెడకు ‘బంగారు’ ఉరితాడు
● పేదలను సంపన్నుల్ని చేయకుండానే..పీ 4 పేరుతో ‘సంక్షేమం’ కట్
● సంక్షేమం ఇవ్వకుండా.. సంపన్నుల మోచేతి కింద పేదోడి బతుకులు
● ఇప్పటికే ప్రకటించిన 64 వేల కుటుంబాల గుర్తింపుపై మరో సర్వే
● మార్గదర్శులుగా చేరాలంటూ
సంపన్నులపై జిల్లా యంత్రాంగం ఒత్తిళ్లు
● ముందుకొచ్చిన మార్గదర్శుల
నమోదుపై అస్పష్టత
విజయనగరం అర్బన్:
పేదరికం లేని సమాజం నిర్మిస్తామనే హామీతో కూటమి ప్రభుత్వం రూపొందించిన పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టనర్‌షిప్ (పీ 4) కార్యక్రమంలో మోసపూరిత ఆలోచనలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా బంగారు కుటుంబాల కోసం అట్టడుగున ఉన్న పేద కుటుంబాల గుర్తింపు సర్వే నుంచి వాళ్లను ఆదుకోవాల్సిన మార్గదర్శుల స్వచ్ఛంద నమోదు ప్రక్రియ వరకు జరుగుతున్న చర్యలన్నీ నాటకీయంగానే కనిపిస్తున్నాయి.
ఇప్పటికే పలు దఫాలుగా సర్వేలు నిర్వహించి.. గుర్తించిన కుటుంబాల ఎంపికలో పారదర్శకత లేదని మళ్లీ అందులో వడపోయాలని కాలయాపన కోసం తాజాగా నిర్ణయించింది. మరోవైపు పేదల్ని ఆదుకునేందుకు మార్గదర్శులు రావాలంటూ ప్రభుత్వం పిలుపునిస్తున్నా.. కూటమి సర్కార్‌పై నమ్మకంలేని సంపన్నులు ముందుకు రావడం లేదు. నిజానికి ఉగాది నాటికే బంగారు కుటుంబాల్లో వెలుగులు నింపుతానని చంద్రబాబు మాటలు పలికారు. ఉగాది వెళ్లి మూడు నెలలు గడిచినా అసలు బంగారు కుటుంబాల ఎంపికే పూర్తి కాలేదు.
● గుర్తించిన 64 వేల కుటుంబాలపై మరో సర్వే
ఆదాయంలో అట్టడుగున ఉన్న 20 శాతం కుటుంబాల (బంగారు కుటుంబాలు)ను అర్థికంగా వృద్ధి చెందిన 10 శాతం మంది (మార్గదర్శులు) ఆగస్టు 15 నాటికి దత్తత తీసుకోవాలని పిలుపునిచ్చారు. గడువు నాటికి బంగారు కుటుంబాలను గుర్తించేందుకు తొలిత జిల్లా వ్యాప్తంగా మార్చి 20 నుంచి క్షేత్ర స్థాయిలో అధికారులు సర్వే చేశారు. సచివాలయ ఉద్యోగులు తమ క్లస్టర్ పరిధిలోని కుటుంబాలను 27 అంశాల ప్రశ్నలు అడిగి సమాచారం తీసుకున్న నేపథ్యంలో జిల్లాలో 64,066 మందిని అట్టడుగున ఉన్న 20 శాతం కుటుంబాల (బంగారు కుటుంబాలు)ను గుర్తించినట్టు జిల్లా అధికారులు ప్రకటించారు. అయితే ఈ ఎంపిక ప్రక్రియలో పారదర్శకత లోపించిందని గుర్తించి తాజాగా మరోసారి క్షేత్ర స్థాయిలో సర్వే చేపడుతుంది. ఈ నెల 28వ తేదీలోగా పూర్తి చేయాల్సిన ఈ సర్వేలో నిరుపేదలుగా గుర్తించిన ఐదు అంశాలను ప్రమాణంగా తీసుకొని మరోసారి బంగారు కుటుంబాల జాబితాను విడుదల చేయనున్నారు.
● ముందుకొచ్చిన మార్గదర్శుల నమోదుపై అస్పష్టత
జిల్లాలో చేపట్టిన సర్వే ద్వారా 20 శాతం నమోదైన 64,066 మంది బంగారు కుటుంబాలకు కనీసం 10 శాతం అంటే కనీసం 6,406 మంది మార్గదర్శకులు అవసరం ఉంటుంది. మార్గదర్శులను వెతకడం జిల్లా అధికారులకు తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో ఇంతవరకు కేవలం 2,321 మంది వరకే మార్గదర్శులుగా ముందుకు వచ్చినట్టు తాజా ఆన్‌లైన్ నివేదికలు చెబుతున్నాయి. వీరిలో చాలా మంది పూర్తి అవగాహనతో నమోదు చేసుకోలేదని తెలుస్తుంది. మార్గదర్శులుగా ఎందుకు చేరాలో చేరిన తరువాత ఏం చేయాలో తెలియని వారున్నారని ఉద్యోగులే చెబుతున్నారు.
● ముందుకు రాని అధికార పార్టీ ప్రతినిధులు
ఇప్పటికే 264 కుటుంబాలకు మంత్రి ప్రకటించిన విషయం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గం పరిధిలో కేవలం 264 కుటుంబాలకే మంత్రి దత్తత తీసుకుంటే మిగిలిన కుటుంబాలు వ్యతిరేకత చూపవా అంటూ నియోజకవర్గ, గ్రామ స్థాయి ప్రజాప్రతినిధులు పెదవి విరుస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్గదర్శకులుగా దత్తత తీసుకునే సామర్థ్యం ఉన్నా ముందుకు రావడానికి అధికార పార్టీ ప్రతినిధులు జంకుతున్నారని సమాచారం. దీంతో ఇంతవరకు నమోదైన మార్గదర్శులు జాబితాలో అధికార పార్టీ ప్రతినిధులు లేని పరిస్థితి వచ్చిందని తెలుస్తోంది. జిల్లా, మండల స్థాయిలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రైవేటు భాగస్వాముల మధ్య సమన్వయం సరిగ్గా లేకపోవడం ఒక ప్రధాన సమస్యగా ఉందని కొందరు అధికారులే చెబుతున్నారు.
సంపన్నులపై అధికారుల ఒత్తిళ్లు
కూటమి ప్రభుత్వం అమలులోకి తెస్తున్న పీ–4 లక్ష్యాలు సాధించడంలో జిల్లా యంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది. జిల్లాలోని ఉపాధ్యాయ, ఉద్యోగుల నుంచి వైద్యుల వరకు వివిధ వృత్తులు, వ్యాపార సంస్థల సంపన్న వర్గాలను మార్గదర్శులుగా నమోదు చేసుకోవాలని వాళ్లకు నేరుగా ఆదేశాలు పంపాలని కూటమి ప్రభుత్వం హుకుం జారీ చేసింది. వాళ్ల చిరునామాలను సేకరించి ఇళ్లకు ఆదేశాలను జిల్లా యంత్రాంగం పంపుతుంది. ప్రభుత్వ వైఖరిపై నమ్మకం లేని సంపన్నులు ముందుకు రావడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో అధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులే మార్గదర్శులుగా మారాలనే ఒత్తిడితో జిల్లా యంత్రాంగం సతమతమవుతుందని తెలుస్తుంది.

మార్గదర్శుల కోసం బతిమలాట..!