
ఏం అమ్మాలనుకుని ఎన్నికల్లో హామీలిచ్చారు..!
విజయనగరం:
ఎన్నికలకు ముందు అధికార దాహంతో హమీలు గుప్పించిన కూటమి నేతలు నేడు వాటిని అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మాలంటూ వాఖ్యలు చేయటం సిగ్గుచేటని విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు అన్నారు. అలాంటప్పుడు అమలుకు సాధ్యం కాని హమీలు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. ఆడబిడ్డ నిధి పథకం అమలుపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చేసిన వాఖ్యలను తప్పు పట్టారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ఘోర వైఫల్యం చెందిందని వారి తప్పులను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల దృష్టిని మళ్లించేందుకు అక్రమ అరెస్టులు చేస్తోందని ధ్వజమెత్తారు. ధర్మపురిలోని సిరిసహస్ర రైజింగ్ ప్యాలెస్‌లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మజ్జి శ్రీనివాసరావు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతుందని చెప్పారు. పాలన మరిచిన ప్రజాప్రతినిధులు రెడ్‌బుక్ రాజ్యాంగం పేరిట కక్ష సాధింపులు చేపట్టే పనిలో నిమగ్నమయ్యారని మండిపడ్డారు. ఇచ్చిన హమీలను ఎగ్గొట్టేందుకు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారని, వాటిని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని స్పష్టం చేశారు. జరగని లిక్కర్ స్కామ్ జరిగినట్టు చిత్రీకరించి తన అనుకూల మీడియాతో అబద్దాన్ని నిజం చేసేలా విష ప్రచారం చేయించి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. తమకు అనుకూలంగా లేని మీడియా ప్రసారాలను నిలిపివేసి అక్కసు వెల్లగక్కుతున్నారని దుమ్మెత్తిపోశారు. మూడుసార్లు ఎంపీగా గెలిచిన పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిపై లిక్కర్ స్కామ్ పేరిట అక్రమంగా కేసు బనాయించటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బాధ్యత గల అధికార పక్షంలో ఉన్న వారు పూర్తి ఆధారాలతో చర్యలు తీసుకోవాలే తప్పా తప్పుడు కేసులు పెట్టి వైఎస్సార్‌సీపీ నాయకులను ఇబ్బందులకు గురి చేయటం సమంజసం కాదన్నారు. ఇటువంటి కక్షపూరిత రాజకీయాలకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హమీలను అమలు చేసేంత వరకు ప్రజల పక్షాన పోరాటం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని హెచ్చరించారు.
కూటమి పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత
కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో వైఫల్యాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని మజ్జి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఇందుకు తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు క్షేత్ర స్థాయిలో చేపడుతున్న బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాలే వేదికగా నిలుస్తున్నాయని చెప్పారు. బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వం ఇచ్చిన హమీలు అమలుపై ప్రశ్నిస్తే ప్రజలంతా తప్పు చేశామన్న భావనను వ్యక్తం చేస్తున్నారన్నారని తెలిపారు. విజయనగరం జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాలు దిగ్విజయవంతంగా సాగుతున్నాయన్నారు. అధికార పక్షం చేపడుతున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని మొక్కుబడిగా సాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మూడేళ్ల పాటు ప్రతిపక్ష నాయకులు కనీసం రోడ్లపై కనిపించలేదని, ఇప్పటి కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత రావడంతో ఏడాదికే పోరుబాట పట్టాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు.
ప్రజల దృిష్టి మళ్లించేందుకు అక్రమ
అరెస్టులు
పాలన గాలికొదిలి రెడ్‌బుక్ రాజ్యాంగం పేరిట కక్ష సాధింపు చర్యలు
జరగని లిక్కర్ స్కామ్ జరిగినట్టు
చిత్రీకరణ
కూటమి ఏడాది పాలనలో వైఫల్యాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత
హామీలు అమలు చేసే వరకు ప్రజల పక్షాన పోరాడుతాం
వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అక్రమ అరెస్టును ఖండిస్తున్నాం
జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్‌సీపీ
జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు
ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో అన్ని రంగాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మజ్జి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. 14 నెలలు గడుస్తున్నా ఒక్క కొత్త పింఛను మంజూరు చేయకపోవటంతో అర్హులైన లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పటం లేదన్నారు. ఉన్న పాత పింఛన్లను సదరం రీ సర్వే పేరిట ఇబ్బందులు పెడుతున్నారని, 50 ఏళ్లకే పింఛను ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి వెన్నెముకగా ఉండే రైతన్న వెన్ను విరుస్తున్నారని మండిపడ్డారు. గత రెండేళ్లుగా అన్నదాత సుఖీభవ మంజూరు చేయకపోవటంతో రైతాంగం అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఖరీఫ్ సాగుకు అవసరమైన యూరియా అందుబాటులో లేదని, దీనిపై ప్రజాప్రతినిధులు కనీసం సమీక్ష నిర్వహించారా? అని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ పోరాటంతో అమలైన తల్లికి వందనం కార్యక్రమం కొందరికే జమ చేసి చేతులు దులుపుకున్నారని ధ్వజమెత్తారు. రాజాంలో ఒక పాఠశాలలో 205 మంది విద్యార్థులుంటే వారిలో ఐదుగురికే ఆ పథకాన్ని వర్తింప జేయటంతో వారంతా అధికారులు చుట్టూ తిరుగుతున్నారన్నారు. బాడంగి మండలంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ ప్రైవేటు ల్యాబ్ నిర్వహిస్తూ వైద్యం కోసం వచ్చే రోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని, ఇదీ వైద్య రంగంపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని నిరూపిస్తుందన్నారు. పలు ఆసుపత్రుల్లో బెడ్లు చాలక ఒకే బెడ్‌పై ఇద్దరు నుంచి ముగ్గురు రోగులకు వైద్యం అందించే దీన పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఒక్క ఏడాదిలో 9000 డ్రాపౌట్స్ ఉన్నాయంటే విద్యారంగం ఏ విధంగా నిర్వీర్యం అవుతుందో అవగతమవుతుందన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ విజయనగరం పార్లమెంటరీ జిల్లా కార్యదర్శి నెక్కల నాయుడుబాబు, పార్టీ అధికార ప్రతినిధి కనకల రఘురామారావు, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్‌కుమార్ పాల్గొన్నారు.

ఏం అమ్మాలనుకుని ఎన్నికల్లో హామీలిచ్చారు..!