
కుళ్లిన గుడ్లు.. పప్పు అన్నమే పరమాన్నం
బొబ్బిలి: పట్టణంలోని పలు మున్సిపల్ పాఠశాలల్లో గత నాలుగు రోజులుగా కుళ్లిన కోడిగుడ్ల సరఫరా జరుగుతోంది. బుధవారం కూడా కుళ్లిన గుడ్లు సరఫరా చేయడంతో కొన్ని పాఠశాలల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం గుడ్లు లేకుండానే మధ్యాహ్న భోజనం పెట్టారు. దీంతో విద్యార్థులు నిరుత్సాహం చెందారు. పట్టణంలోని తాండ్ర పాపారాయ ప్రాధమిక పాఠశాల, జయప్రకాష్ మున్సిపల్ ప్రాధమిక పాఠశాలకు సరఫరా చేసిన గుడ్లు కుళ్లిపోయాయి. వారానికి నాలుగు రోజుల పాటు గుడ్లు సరఫరా చేయాల్సి ఉండగా ప్రతీసారి కలర్ కోడ్‌తో గుడ్లు ఇస్తుంటారు. అయితే గత నాలుగు రోజులుగా తాండ్ర పాపారాయ పాఠశాలలో 24 మంది విద్యార్థులకు కనీసం నాలుగుకు తగ్గకుండా గుడ్లు కుళ్లిపోతున్నాయని ఉపాధ్యాయురాలు కె.శాంతి తెలిపారు. జయప్రకాష్ మున్సిపల్ పాఠశాలలో 79 మంది విద్యార్థులకు 64 మంది హాజరు కాగా అన్ని గుడ్లూ కుళ్లిపోయినట్టు హెచ్‌ఎం సీహెచ్ మోహనరావు, భోజన నిర్వాహకులు పెట్ల విజయలక్ష్మి, భాగ్యలక్ష్మి తెలిపారు. కుళ్లిపోయి నల్లగా మారిన ఈ గుడ్లను విద్యార్థులకు పెట్టవద్దని పారబోయాలని హెచ్‌ఎం ఆదేశించడంతో విద్యార్థులకు పప్పన్నం, కొన్ని పాఠశాలల్లో ప్లెయిన్ బిర్యానీ పెట్టారు. మండలంలోని మెట్టవలసలో కూడా కోడి గుడ్లు కుళ్లిపోయినట్టు విద్యాశాఖాధికారులకు సమాచారం వచ్చింది. ఇలా నిత్యం విద్యార్థుల సంఖ్యను బట్టి పది నుంచి 50 వరకూ గుడ్ల వరకూ కుళ్లి పోతున్నాయని, ఫొటోలు అప్‌లోడ్ చేస్తున్నట్టు ఆయా పాఠశాలల సిబ్బంది చెప్పారు. ఈ సంఘటనపై ఎంఈవో గొట్టాపు వాసును వివరణ కోరగా కుళ్లిన గుడ్ల స్థానంలో మళ్లీ గుడ్లు ఇస్తారని తెలిపారు. మరి గుడ్లు మళ్లీ ఇచ్చాక విద్యార్థులకు పాత వాటితో కలిపి రెండేసి గుడ్లు ఇస్తారేమో చూడాలి!
మున్సిపల్ పాఠశాలల్లో విద్యార్థులకు భోజన అవస్థలు

కుళ్లిన గుడ్లు.. పప్పు అన్నమే పరమాన్నం

కుళ్లిన గుడ్లు.. పప్పు అన్నమే పరమాన్నం