
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన తప్పనిసరి
విజయనగరం అర్బన్: సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతున్న పరిస్థితుల్లో అందుకు అనుగుణంగా విద్యార్థులకు అవగాహన తప్పనిసరి అని కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ ఇన్‌చార్జ్ వీసీ ప్రొఫెసర్ టి.శ్రీనివాసన్ అన్నారు. స్థానిక కేంద్రీయ గిరిజన యూనివర్సిటీలో సోషల్ వర్క్ విభాగం ఆధ్వర్యంలో ‘మీరు కార్పొరేట్‌కు సిద్ధంగా ఎలా మారగలరు..?’ అనే అంశంపై బుధవారం జరిగిన ఒక రోజు సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తొలిత సదస్సును జ్యోతి ప్రజ్వలన చేసి ఇన్‌చార్జ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జితేంద్ర మిశ్రా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతిక నైపుణ్యాల అందిపుచ్చుకోవడానికి లెర్నింగ్, అన్‌లెర్నింగ్, రీలెర్నింగ్ వంటి ధోరణి కీలకమని పేర్కొన్నారు. కార్పొరేట్ రంగ అవసరాలను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు అవసరమైన శిక్షణ ఎంతో ముఖ్యమని, విద్యార్థులు తమ నైపుణ్యాలను కంపెనీల అవసరాలకు అనుగుణంగా మెరుగుపరచుకోవాలని సూచించారు. రీసోర్స్‌పర్సన్‌గా అసోసియేట్ డైరెక్టర్ (లెర్నింగ్ అండ్ ఆర్గనైజేషన్ డెవలప్‌మెంట్) ఎ.సెంతిల్‌కుమార్ కార్పొరేట్ నైపుణ్యాలపై విద్యార్థులకు అవగాహన పరిచారు. కార్యక్రమంలో కన్వీనర్ డాక్టర్ నాగేష్.ఎం, అసిస్టెంట్ ప్రొఫెసర్, సోషల్ వర్క్ విభాగం అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూనివర్సిటీకి చెందిన మూడవ సెమిస్టర్ ఎంబీఏ విద్యార్థి నానిబాబు మరియు ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ మూడవ సెమిస్టర్ విద్యార్థిని సింధుప్రియ, యూజీసీ సెట్ అర్హత సాధించిన విద్యార్థులను అభినందించారు.