
బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలి : కలెక్టర్
విజయనగరం అర్బన్: పేదరిక నిర్మూలనే పీ–4 కార్యక్రమం ప్రధాన లక్ష్యమని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్పష్టం చేశారు. బంగారు కుటుంబాలను దత్తత తీసుకొని వారిని పేదరికం నుంచి బయటకు తీసుకురావడానికి పారిశ్రామిక వేత్తలు మార్గదర్శులుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌లో బుధవారం జిల్లాలోని పారిశ్రామిక వేత్తలతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు పేర్కొన్నారు. ఇప్పటి వరకు పారిశ్రామిక వేత్తలు సీఎస్‌ఆర్ ద్వారా ప్రజలకు పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కృషి చేశారని అన్నారు. ఇకనుంచి పేద కుటుంబాలను వ్యక్తిగతంగా దత్తత తీసుకొని, పేదరికం నుంచి వారు శాశ్వతంగా బయట పడే విధంగా చైతన్య పరచడం, అవసరమైన విద్య, ఇతరత్రా సహకారాన్ని అందించడం చేయాల్సి ఉంటుందన్నారు. బంగారు కుటుంబాల తుది జాబితాను తయారు చేసేందుకు ఈ నెల 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు మరోమారు గ్రామ సభలను నిర్వహిస్తున్నామని తెలిపారు. సమావేశంలో సీపీవో పి.బాలాజీ, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ కరుణాకర్, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ సరిత, వివిధ పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.