
‘ఆడబిడ్డ నిధి’కి ఎగనామం!
ఎన్నికల సమయంలో ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన పేదకుటుంబాల మహిళలకు నెలకు రూ.1500 చొప్పున ఇస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని విస్మరించేలా.. పథకం అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్‌ను అమ్మేయాలన్న వ్యవసాయశాఖమంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై మహిళాలోకం భగ్గుమంటోంది. కూటమి తీరును వైఎస్సార్‌సీపీ నేతలు దుయ్యబట్టారు. – రాజాం/బొబ్బిలి/దత్తిరాజేరు
మహిళలంటే చిన్నచూపు
కూటమి ప్రభుత్వానికి మహిళలంటే చిన్నచూపు. ఎన్నికల్లో 18 ఏళ్లు నిండిన అర్హులైన మహిళలందరికీ ఆడబిడ్డ నిధి పథకం కింద నెలకు రూ.1500 ఇస్తామని నమ్మించారు. తీరా పథకం అమలుచేయాలంటే రాష్ట్రాన్ని అమ్మాలంటూ మంత్రి అచ్చెన్నాయుడు మాటలు చూస్తుంటే మహిళలను మోసం చేసేందుకు సిద్ధమైనట్టే కనిపిస్తోంది. దీనిపై మహిళలు ఉద్యమించాలి. నాయకులను ప్రశ్నించాలి.
– బొత్స అప్పలనరసయ్య,
గజపతినగరం మాజీ ఎమ్మెల్యే
ఆ రోజు ఈ లెక్కలు ఏమయ్యాయి
గెలుపే లక్ష్యంగా చేసుకుని లేని పోని హామీలు ఇవ్వడం టీడీపీ నేతలకు వెన్నతో పెట్టిన విద్య. ఈ దఫా సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతలు ఎంతగా ఓటర్లను మోసగించారో ఇప్పుడిప్పుడే ప్రజలు గమనిస్తున్నారు. అర్హులైన మహిళలందరికీ నెలకు రూ. 1500 చొప్పున ఆడబిడ్డ నిధి ఇస్తామని చెప్పి, ఇప్పుడు పథకం అమలుచేయలేని స్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని చెప్పడం విచారకరం. ఎన్నికలముందు సూపర్‌సిక్స్ హామీలు ఇచ్చినప్పుడు ఈ లెక్కలు ఏమయ్యాయో అచ్చెన్నాయుడే చెప్పాలి. – డాక్టర్ తలే రాజేష్,
వైఎస్సార్ సీపీ రాజాం నియోజకవర్గ ఇన్‌చార్జ్
రాష్ట్రాన్ని అమ్మి పథకాలిస్తామని నాడు హామీ ఇచ్చారా?
ప్రజలకు ఏ పథకాలు అమలు చేస్తే సుభిక్షంగా ఉంటారో ఆలోచించి పార్టీలు వారి మేనిఫెస్టోను ప్రచారం చేస్తాయి. మాటమీద నిలబడి వాటిని ఎంత కష్టమైనా అమలు చేస్తాయి. టీడీపీ అధికారంలోకి వస్తే అమలు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టిన పథకాలను అమలు చేయడానికి రాష్ట్రాన్ని అమ్మేయాలని అనడం దారుణం. ప్రజలకు పార్టీల మీద, ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నమ్మకం పోయే విధంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడటం దారుణం. ఆడబిడ్డ నిధి అమలు చేయకపోగా దానిని అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలని మహిళల సాక్షిగా వెకిలి నవ్వులు నవ్వుతూ ప్రసంగించడం అన్యాయం. అసలు మీరు రాష్ట్రాన్ని అమ్మేసి పథకాలు అమలు చేస్తామని గద్దెనెక్కారా? అప్పుడు అధికారంలో ఉన్న వైఎస్సార్‌సీపీ అమలు చేసి చూపించడంతో మరిన్ని పథకాలు అమలు చేస్తామన్నారు. సంపద సృష్టిస్తామన్నారు. ఇప్పుడు అమ్మేయాలంటున్నారు. ఏంటో మీ విధానాలు? ప్రజలంతా గమనిస్తున్నారు. త్వరలోనే మీరు పుట్టిమునిగే పరిస్థితులు వస్తాయి. – శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, మాజీ ఎమ్మెల్యే, బొబ్బిలి

‘ఆడబిడ్డ నిధి’కి ఎగనామం!

‘ఆడబిడ్డ నిధి’కి ఎగనామం!

‘ఆడబిడ్డ నిధి’కి ఎగనామం!