
దేవదాయశాఖ భూముల పరిరక్షణకు చర్యలు
రాజాం: దేవదాయ, ధర్మాదాయశాఖకు చెందిన భూములను పరిరక్షిస్తామని ఆ శాఖ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ కె.శిరీష తెలిపారు. రాజాం పట్టణంలో జీఎంఆర్ కేర్ ఆస్పత్రి రోడ్డులోని దేవదాయశాఖ భూములను మంగళవారం పరిశీలించారు. అక్రమ నిర్మాణాలు చేపట్టినవారిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. నెలరోజుల్లో అంతా ఖాళీచేయాలని ఆక్రమణదారులకు నోటీసులు జారీచేశామని, మరో వారం రోజులు గడువు ఇస్తున్నామని, ఖాళీ చేయకుంటే మొత్తం తొలగిస్తామని హెచ్చరించారు. డోలపేటలోని శ్రీ ఉమామహేశ్వర, లక్ష్మీనారాయణ స్వామి దేవాలయాలకు చెందిన భూముల స్వాధీనానికి కోర్టు ఆదేశాలిచ్చిందన్నారు. ఆక్రమణదారులు ధర్మంగా ఖాళీ చేస్తే మంచిదని, లేదంటే చట్టపరమైన శిక్ష తప్పదన్నారు. దేవదాయశాఖ భూముల్లోని దుకాణాలన్నింటిని వారంరోజులు తర్వాత తమ ఆధీనంలోకి తీసుకుని, మరో 15 రోజులు తర్వాత వేలంపాట వేసి అప్పగిస్తామన్నారు. జీఎంఆర్ ఐటీ కళాశాల పక్కన దేవదాయశాఖ భూమిలో వెలసిన దుకాణాలను సీజ్ చేశారు. రాజాం పట్టణంలో సారధిలో పలు వీధుల్లో నిషేధిత జాబితాలో ఉన్న భూములు పరిశీలించారు. కస్పావీధి, ఠాణావీధి, ఆశపు వీధి, అగ్రహారం వీధి ప్రాంతాల్లోని దేవదాయశాఖ భూములను సర్వేయర్ సత్యనారాయణ సమక్షంలో సర్వేచేయించారు. నివేదికలు ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు. ఆమె వెంట ఈఓ మాధవరావు, వాకచరల్ల రాజా, అమర్, శంకర్, శ్రీరాములు, మురళీ తదిరుల ఉన్నారు.
ఆక్రమణదారులకు నోటీసులు
వ్యాపారులకు హెచ్చరికలు జారీచేసిన దేవదాయశాఖ ఏసీ శిరీష