బ్యానర్‌... | - | Sakshi
Sakshi News home page

బ్యానర్‌...

Jul 20 2025 5:29 AM | Updated on Jul 20 2025 3:07 PM

గంట్యాడ మండలం పెదవేమలి గ్రామంలో సాగుకు నోచుకోక ఖాళీగా ఉన్న పంట పొలాలు

రైతన్నకు గడ్డు పరిస్థితి ముందుకు సాగని ఖరీఫ్‌ సాగు

జిల్లాలో పంటల సాగు సాధారణ విస్తీర్ణం: 1,16,993 హెక్టార్లు

ఇంతవరకు సాగైనది 22,045 హెక్టార్లలోనే..

కర్షకుల్లో అయోమయం

విజయనగరం ఫోర్ట్‌:

రీఫ్‌ సీజన్‌ లో వ్యవసాయ పనులు చురుగ్గా సాగాల్సిన జూలై నెలలో వరుణుడు మొహంచాటేశాడు. అక్కడక్కడ చిరుజల్లులే కురుస్తున్నాయి. చెరువుల్లో నీరు చేరే పరిస్థితి లేదు. పంటల సాగు మందకొడిగా సాగుతోంది. మరోవైపు కూటమి ప్రభుత్వం రైతన్నపై కక్షకట్టింది. గతేడాది అందజేయాల్సిన అన్నదాత సుఖీభవ పథకాన్ని ఎగ్గొట్టింది. ఈ ఏడాది ఖరీఫ్‌ ఆరంభంలో రైతన్నకు అందజేయాల్సిన పెట్టుబడి సాయం ఊసెత్తడంలేదు. విత్తనాలు, ఎరువులు, దమ్ము, నాట్లు వేసేందుకు అయ్యేఖర్చులకు చేతిలో చిల్లిగవ్వలేక రైతులు బేలచూపులు చూస్తున్నారు. అప్పులు చేసి పంటల సాగుకు ఉపక్రమించారు. గత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఏటా మే నెలలోనే వైఎస్సార్‌ రైతుభరోసా పథకం కింద తొలివిడత సాగుసాయం అందించేదని, సాగు ఖర్చులకు బెంగ ఉండేది కాదని, వర్షాలు కూడా అనుకూలించడంతో ఉత్సాహంగా ముందుకు సాగేవారమని, ప్రస్తుత పరిస్థితులు భిన్నంగా ఉన్నాయంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు.

పంటల సాగు అంతంత మాత్రమే...

జిల్లాలో అధిక విస్తీర్ణంలో పంటల సాగుకు వర్షమే ఆధారం. వర్షాలు అనుకూలించకపోవడంతో సాగు ప్రతికూలంగా మారింది. మరోవైపు ప్రాజెక్టుల నుంచి సాగునీరు విడిచిపెట్టినా కాలువలు అధ్వానంగా ఉండడంతో శివారు భూములకు సాగునీరు అందని పరిస్థితి. వరినారు సిద్ధమైనా.. దమ్ముచేసి నాట్లు వేయడానికి అవసరమైన నీరు లేకపోవడం సమస్యగా మారింది. జిల్లాలో ఖరీఫ్‌లో వరి, జొన్న, మొక్కజొన్న, వేరుశనగ, నువ్వు, పత్తి, చెరకు తదితర పంటల సాగు సాధారణ విస్తీర్ణం 1,16,993 హెక్టార్లు. జూలై 18వ తేదీ నాటికి కేవలం 22,045 హెక్టార్లలో మాత్రమే పంటలు సాగయ్యాయి. వరి పంట 7,464 హెక్టార్లు, జొన్న పంట 5, మొక్కజొన్న 7,454, పెసర, మినుము పంటలు 19, వేరుశనగ 46, నువ్వులు 3,799, పత్తి 1507, గోగు 15, చెరకు 1729 హెక్టార్లలో సాగయ్యాయి.

నాలుగు మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదు

జిల్లాలోని రామభద్రపురం, బొబ్బిలి, పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదైంది. రామభద్రపురంలో 378.5 మి.మీ సాధారణ వర్షపాతం కాగా 290.7 మి.మీ, బొబ్బిలిలో 377.6 మి.మీకు 343.6, పూసపాటిరేగలో 268.8 మి.మీకు 245.2 మి.మీ, భోగాపురంలో 295.5 మి.మీకు 277.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో 10 రోజుల పాటు తుఫాన్‌ వాతావరణం నెలకున్నా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. జిల్లాలో 10 వేలు వరకు చెరువులు ఉన్నాయి. వీటిల్లో అధిక శాతం చెరువులు నిండలేదు. రైతులు పంటల సాగుకు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకుంది.

నీరుగారుతున్న ఖరీఫ్‌ ఆశలు

వరుణుడు కరుణించకపోవడంతో ఖరీఫ్‌ ఆశలు సన్నగిల్లుతున్నాయి. వరి నారు సిద్ధంగా ఉన్నా నీరులేక నాట్లు వేయలేని పరిస్థితి. ఇప్పటికే అప్పుచేసి విత్తనాలు కొనుగోలుచేశాం. పొలాలను దుక్కిచేశాం. ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు రూపాయి పెట్టుబడి సాయం అందలేదు. గతంలో ఏటా ఠంచన్‌గా పెట్టుబడి సాయం అందేది. పెట్టుబడి ఖర్చులు గట్టెక్కేవి.

– కర్రి అప్పలనాయుడు, రైతు, రాకోడు గ్రామం, విజయనగరం మండలం

ఆ ఉత్సాహం లేదు...

గతంలో వర్షాలు అనుకూలించేవి. మరోవైపు ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం అందేది. వ్యవసాయమంటే పండగలా ఉండేది. పంటల సాగును ఉత్సాహంగా చేపట్టేవారం. కూటమి ప్రభుత్వం వచ్చాక అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి రెండో ఏడాది వచ్చినా ఇంతవరకు సాయం అందించలేదు. భారీ వర్షాలు కురకపోవడంతో చెరువులు నిండలేదు. దమ్ము చేయడానికి అవసరమైన నీరు లేదు. దీంతో ఏం చేయాలో తెలియడం లేదు.

– ఎస్‌.రామునాయుడు, రైతు, పెదవేమలి గ్రామం

బ్యానర్‌... 1
1/4

బ్యానర్‌...

బ్యానర్‌... 2
2/4

బ్యానర్‌...

బ్యానర్‌... 3
3/4

బ్యానర్‌...

బ్యానర్‌... 4
4/4

బ్యానర్‌...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement