
అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలి
● కలెక్టర్ బి.ఆర్.అంబేడ్కర్
విజయనగరం ఫోర్ట్: అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖకు చెందిన సీడీపీఓలు, సూపర్ వైజర్స్‌తో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అంగన్‌వాడీ కేంద్రాలకు మరుగుదొడ్లు, విద్యుత్ సదుపాయం తప్పనిసరన్నారు. తక్కువ బరువు ఉన్న పిల్లలు బరువు పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సీ్త్ర, శిశు సంక్షేమశాఖ సాధికారత అధికారిణి టి.విమలారాణి పాల్గొన్నారు.
వేతనదారులకు కనీస వేతనాలు అందించాలి
ఉపాధిహామీ వేతనదారులకు రూ.307 వేతనం వచ్చేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అంబేద్కర్ తెలిపారు. డ్వామా ఇంజినీరింగ్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాకు కేటాయించిన 1.33 లక్షల పనిదినాల లక్ష్యాన్ని పూర్తిచేయాలన్నారు. దీనికోసం అధికారులు రోజువారీ సమీక్ష నిర్వహించాలన్నారు. సమావేశంలో డ్వామా పీడీ శారదాదేవి పాల్గొన్నారు.
ఓపెన్‌స్కూల్ విద్యార్థులకు ధ్రువపత్రాలు
విజయనగరం అర్బన్: ఓపెన్ స్కూల్–2025 విద్యాసంవత్సరంలో ఉత్తీర్ణులైన పదోతరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థుల ధ్రువపత్రాలను సార్వత్రిక విద్యాపీఠం విడుదల చేసిందని డీఈఓ యు.మాణిక్యంనాయుడు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. వీటిని అభ్యర్థుల ఇంటి అడ్రస్‌కు స్పీడ్ పోస్టులో పంపిస్తామని తెలిపారు. అడ్రస్‌ల వివరాలను ‘ఏపీ ఓపెన్‌స్కూల్.ఏపీ.జీఓవీ.ఐఎన్’ వెబ్ సైట్‌లో పరిశీలించుకోవాలన్నారు.
24న టీటీసీ లోయర్ గ్రేడ్ థియరీ పరీక్షలు
టీటీసీ లోయర్ గ్రేడ్ థియరీ పరీక్షను ఈ నెల 24న రెగ్యులర్, ఫెయిలైన విద్యార్థులకు నిర్వహిస్తామని డీఈఓ తెలిపారు. ఆ రోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఎడ్యుకేషన్ సైకాలజీ అండ్ స్కూల్ అడ్మిషన్ పేపర్, మధ్యాహ్నం 2 నుంచి 3 గంటలకు మెథడ్స్ ఆఫ్ టీచింగ్ (జనరల్) పేపర్, 3.30 నుంచి 4.30 గంటలకు మెథడ్స్ ఆఫ్ టీచింగ్ (స్పెషల్) పేపర్ పరీక్ష ఉంటుందని తెలిపారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను ‘బీఎస్‌ఈ.ఏపీ.జీఓవీ.ఐఎన్’ వెబ్‌సైట్‌లో పొందుపరిచామన్నారు. అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న హాల్‌టికెట్, గుర్తింపు కార్డుతో పరీక్షకు హాజరుకావాలని కోరారు.
21న పీడీఎస్ బియ్యం వేలం
విజయనగరం ఫోర్ట్: గత కొద్ది కాలంగా జరిపిన తనిఖీల్లో దొరికిన పీడీఎస్ బియ్యాన్ని ఈ నెల 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విజయనగరం ఎంఎల్‌ఎల్ పాయింట్ వద్ద వేలం వేస్తామని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కె.మధుసూదనరావు తెలిపారు. మొత్తం 90.80 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని వేలంవేస్తామని చెప్పారు.