
పాములకు ప్రాణసంకటం
అవగాహన లోపం..
● అంతరించి పోతున్న సర్పజాతులు
● రైతు మిత్రులకు రక్షణ కరువు
● నేడు వరల్డ్ స్నేక్ డే
పాము కనిపిస్తే సమాచారం ఇవ్వండి..
పాములు కనిపిస్తే సమాచారం ఇవ్వండి. సర్ప జాతుల సంరక్షణకు స్నేక్ రెస్క్యూ టీమ్ తరలి వస్తుంది. ప్రాణాపాయం లేకుండా పట్టుకుని అడవుల్లో విడిచి పెడతాం. అటవీశాఖాధికారుల సహకారంతో గ్రీన్ మెర్సీ సంస్థ ఉచితంగా సేవలు అందిస్తుంది. సర్పజాతులను చంపవద్దు. ప్రకృతి సమతుల్యం దెబ్బతింటుంది. పాములుంటే వ్యవసాయానికి మేలు. ఎలుకలు, పందికొక్కులు లేకుండా చేస్తాయి.పాము కనిపిస్తే హెల్ప్‌లైన్ నంబర్–9848414658కు తెలియ పరచండి.
– కేవీ రమణమూర్తి, సీఈఓ, గ్రీన్‌మెర్సీ
భామిని: వ్యవసాయ రంగంలో కీలకమైన రైతు మిత్రులలో సరీసృపాలుగా పిలిచే పాకెడి జీవులున్నాయి.ఈ కోవలో ఒకటైన సర్ప జాతి జీవులపై అవగాహన లోపంతో అంతరించి పోయే దుస్థితి ఏర్పడింది. హైందవ సంప్రదాయంలో పవిత్ర స్థానం గల సర్పాలకు పూజలు, నోములు చేపట్టిన చోటే అవగాహన లోపంతో అంతం చేసే సంస్కృతి సాగుతోంది. దెబ్బ తగిలిన పాము పగ పడుతుందనే కల్పన, పాము కాటు వేస్తే విష ప్రభావంతో మరణిస్తామనే భయంతో వాటిని హతం చేస్తున్నారు. దీంతో జన బాహుళ్యంలో పాముల మనుగడ కష్టమైంది. రైతు పండించే పంటలో నలభై శాతం స్వాహా చేస్తున్న ఎలుకలు, పందికొక్కుల నివారణలో కీలక పాత్రధారిగా పిలిచే సర్పాలకు నిలువ నీడ లేకుండా పోతోంది. పర్యావరణ పరిరక్షణలో కీలకంగాను, భూ సారాన్ని కాపాడే ముఖ్యమైన పాకెడి జీవిగా గుర్తింపు పొందినా తగిన రక్షణ కరువవుతోందని పర్యావరణ హితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆధునిక వ్యవసాయంతో కష్టాలు
ప్రధానంగా వ్యవసాయ రంగంలో క్రిమి సంహారక మందుల ప్రవేశంతో పాకెడి జీవుల అంతరించిపోతున్నాయి. విష తుల్యమైన జీవులను వేటాడి భుజించి ప్రమాదాలకు గురవుతున్నాయి. ఆధునిక యంత్రాల వాడకంలో పుట్టలు, తుప్పలు, దిబ్బలు లేకుండా, భూమిలో బొరియలు కూడా కరువై పాముల జీవనం కష్టమైందని చెప్పవచ్చు.
విష సర్పాలు తక్కువ..
మన చుట్టూ తిరుగుతున్న పాములలో 80 శాతం సాధారణ విషంలేని సర్పాలే ఉన్నాయి. విషపూరిత మైనవి, ప్రాణాంతకమైనవి కొద్దిగానే ఉన్నాయి. మన ప్రాంతంలో వీటిలో నాలుగు రకాలైన తాచుపాము(నాగుపాము), రక్తపింజర, కట్లపాము, పొడపాములుగా గుర్తించారు. పాము కాటుకు గురైన వ్యక్తుల్లో అత్యధికంగా భయంతోనే ఎక్కువ మంది ప్రాణాలు పోగోట్టుకుంటున్నారని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
పాములపై అవగాహన..
విద్యార్థి స్థాయి నుంచి పాములపై అవగాహన కల్పించాలి. అన్ని పాములు ప్రమాదకారి కావని తెలియజేయాలి. పాము పగబడుతుందనే మూఢ నమ్మకాలు విడిచి పెట్టేలా అవగాహన కల్పించాలి. స్నేక్స్ ప్రేండ్లీ సొసైటీలు ఏర్పాటు కావాలి. అన్ని పాములను సంహరించడం తగదు.కొట్టి చంపకుండా, పట్టి దూరంగా విడిచి పెట్టాలి. జాతులు అంతరించ పోకుండా చూడాలి.
పాములన్నీ విష సర్పాలు కావు..
పాములన్నీ విష సర్పాలు కావు.అన్ని పాములకు వి షం ఉండదు. పాము కాటు వేస్తే చనిపోవడం ఖాయమనే భయాన్ని వీడాలి. ప్ర మాదవశాత్తు పాముకాటు కు గురైనా భయపడవద్దు. అందుబాటులోని ప్రభుత్వాస్పత్రికి తీసుకురండి. విషాన్ని నివా రించే ఏంటీస్నేక్ వీనమ్(ఏఎస్‌వీ) మందులు అందుబాటులో ఉన్నాయి. పాముకాటు పడిన తరువాత గాయాన్ని కడగవద్దు. పాము వేసిన గాట్లు గుర్తించి విషప్రభావం లెక్కించి ఏఎస్ వీలు వేస్తాం. – డాక్టర్ కె.విజయ పార్వతి,
డిప్యూటీ డీఎంహెచ్‌ఓ, సీతంపేట

పాములకు ప్రాణసంకటం

పాములకు ప్రాణసంకటం