
నాలుగు నెలలుగా రేషన్ బకాయి..!
గుమ్మలక్ష్మీపురం: నాలుగు నెలలుగా రేషన్ ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన గ్రామస్తులు డిపో తాళాన్ని విరగ్గొట్టి ఏకంగా 230 బియ్యం బస్తాలను తీసుకెళ్లారు. ఈ ఘటన గుమ్మలక్ష్మీపురం మండలంలో జరిగింది. మండలంలోని గొయిపాక గ్రామంలో రేషన్ సబ్‌డిపో ఉంది. ఇక్కడ డీలర్‌గా పనిచేస్తున్న కిల్లక జయమ్మ రేషన్ బియ్యం సక్రమంగా ఇవ్వడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో డిపో పరిధిలోని కిత్తలాంబ, రసాబడి తదితర గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2024 ఆగస్టులో డీలర్ జయమ్మను అధికార పార్టీ ప్రోద్బలంతో అధికారులు సస్పెండ్ చేశారు. తదనంతరం డిపో నిర్వహణ బాధ్యతలను స్వయం సహాయక సంఘానికి చెందిన కిల్లక రజని అనే అధికార పార్టీకి చెందిన మరో మహిళకు అప్పగించారు. తన సస్పెన్షన్‌ను సవాల్ చేస్తూ డీలర్ జయమ్మ కోర్టులో కేసు వేశారు. న్యాయస్థానం స్టే విధించింది. దీంతో జయమ్మ మళ్లీ గొయిపాక డిపో డీలర్‌గా ఈ ఏడాది మేలో విధుల్లో చేరారు. మే, జూన్ నెలలకు సంబంధించిన రేషన్ సరుకులను డిపో పరిధిలోని కార్డుదారులందరికీ సరఫరా చేశామని ఆమె చెబుతున్నారు. ఈ క్రమంలో గత ఏడాది తమకు బకాయి ఉన్న బియ్యాన్ని ఇవ్వాలని ఈ నెల 11, 12వ తేదీల్లో డిపో వద్ద కిత్తలాంబ, రసాబడి గ్రామస్తులు ఆందోళనకు దిగారు. కొన్ని కారణాల రీత్యా బియ్యం ఇవ్వలేకపోయామని, దఫదఫాలుగా సరఫరా చేస్తానని సదరు డీలర్ వారికి నచ్చజెప్పారు. అనంతరం ఆమె డిపోకు తాళం వేసి ఇంటికి వెళ్లిపోయారు. శాంతించని కిత్తలాంబ గ్రామస్తులు డిపోకు వేసిన తాళాన్ని విరగ్గొట్టి, లోపలున్న 230 బియ్యం బస్తాలను లగేజ్ వ్యాన్‌లో ఎక్కించుకుని తీసుకెళ్లిపోయారు. దీంతో డీలర్.. ఉన్నతాధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. ఎల్విన్‌పేట పోలీస్ స్టేషన్‌కు కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో వివాదాన్ని సర్దుమణిగించేందుకు కొంతమంది పెద్దలు ప్రయత్నాలు సాగించినట్లు సమాచారం.
నెలాఖరులోగా బకాయి బియ్యం సరఫరా
మంగళవారం గొయిపాక డిపో వద్ద గ్రామస్తులు, డీలర్‌తోపాటు, సేల్స్‌మెన్ కమిటీ, పౌర సరఫరాలు, రెవెన్యూ అధికారులు కలిసి చర్చలు జరిపారు. లబ్ధిదారులకు ఈ నెలాఖరులోగా రెండు నెలలకు సంబంధించిన బియ్యాన్ని ఇచ్చేందుకు డీలర్ అంగీకరించారు. దీంతో డిపో నుంచి తీసుకెళ్లిన రేషన్ బస్తాలను తిరిగి ఇచ్చేందుకు గ్రామస్తులు అంగీకరించినట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఎప్పుడో బకాయిలకు సంబంధించి ఇప్పుడు నిరసన వ్యక్తం చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో కొంతమంది ప్రమేయం ఉన్నట్లు వినిపిస్తోంది.
డిపో తాళాలు విరగ్గొట్టిన గ్రామస్తులు
230 బస్తాలు తీసుకెళ్లిన ప్రజలు
పెద్ద మనుషుల సమక్షంలో రాజీ