
చిన్నారి విషాదం..!
● విద్యార్థుల మధ్య ముష్టియుద్ధం
● దెబ్బలు తాళలేక తొమ్మిదో తరగతి విద్యార్థి మృతి
బొబ్బిలి: పట్టణంలోని అభ్యుదయ హైస్కూల్‌కు చెందిన విద్యార్థుల మధ్య గొడవ ఓ విద్యార్థి మృతికి దారితీసింది. మనస్పర్థలకు ఓ నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. నిరుపేద క్షురక కుటుంబానికి చెందిన ఒక్కగానొక్క కుమారుడు ఈ కొట్లాటలో చనిపోవడంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల ఆవేదనకు అంతులేకుండా పోయింది. బొబ్బిలిలో సోమవారం జరిగిన ఈ విషాదకర సంఘటన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని కాలేజీ రోడ్డులో బార్బర్ షాపు పెట్టుకుని జీవనం వెళ్లదీస్తున్న సుందరాడ సత్యనారాయణ(సంతోష్), విజయ దంపతులకు కార్తీక్(14), కీర్తన ఉన్నారు. కార్తీక్‌ను పట్టణంలోని అభ్యుదయ స్కూల్లో చదివిస్తున్నారు. సీసీటీవీలో కనిపించిన దృశ్యాల ప్రకారం రోజూలాగే విద్యార్థి కార్తీక్ స్కూల్ విడిచిపెట్టాక సహ విద్యార్థులతో కలిసి కోట గుమ్మంలోంచి పట్టణంలోని సున్నపు వీధిలోని తన ఇంటికి వస్తున్నాడు. వారితో పాటు వస్తున్న పదో తరగతి చదువుతున్న మండలంలోని గున్నతోటవలసకు చెందిన విద్యార్థి కోటలో గంట కొట్టే ప్రాంతం వద్ద వెనక్కు నడిచి వస్తున్న కార్తీక్ ఒక్కసారిగా పిడిగుద్దులతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అయితే కొద్ది సేపే కొట్లాడుకున్నప్పటికీ దెబ్బలకు తాళలేని కార్తీక్ ఐదారు అడుగులు వేశాక ఒక్కసారిగా నడక బాట పక్కగా ఒరిగిపోయి కుప్పకూలాడు. వెంటనే స్థానికులు కార్తీక్‌ను సీహెచ్‌సీకి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు.
మృతదేహాన్ని వెనక్కి తెచ్చిన బంధువులు
విద్యార్థి మృతదేహాన్ని వైద్యసిబ్బంది గొడవవుతుందని ఆలోచించి పోస్ట్‌మార్టం రూమ్‌లోకి తీసుకువెళ్లిపోయారు. ఏం జరిగిందో తెలియకుండా పోస్ట్‌మార్టం చేయడానికి వీల్లేదని బంధువులు విద్యార్థి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం రూమ్ నుంచి మళ్లీ ఆస్పత్రిలోకి తీసుకువచ్చారు. ఈ లోగా పోలీసులకు, పాఠశాల యాజమాన్యానికి, విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించి ఆస్పత్రికి చేరుకున్నారు. కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఆస్పత్రి ప్రాంగణమంతా జనాలతో నిండిపోయింది. సీఐ కె.సతీష్ కుమార్ సిబ్బందితో సంఘటనా స్థలానికి, ఆస్పత్రికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. కుటుంబ సభ్యులు, యాజమాన్యం, తల్లిదండ్రులతో రాత్రి పది గంటల వరకూ చర్చిస్తూనే ఉన్నారు. పోలీసులు వివరాలు వెల్లడించే వరకూ విద్యార్థులు ఎందుకు కొట్లాడుకున్నారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. అయితే క్రికెట్ లేదా బాలిక విషయమై ఇద్దరి మధ్య కొద్ది రోజులుగా మాటల్లేవని, ఈ నేపథ్యంలోనే స్కూల్ నుంచి నడిచి వస్తుండగా భావోద్వేగానికి గురైన వారిద్దరూ ఒక్కసారిగా తీవ్రంగా కొట్లాడుకున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై సీఐ కె.సతీష్ కుమార్ మాట్లాడుతూ సంఘటనపై కేసు నమోదు చేశామని, విద్యార్థుల కేసు జువైనల్ కిందికి వస్తుందని పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.

చిన్నారి విషాదం..!

చిన్నారి విషాదం..!