
గుండాం సమీపంలో ఏనుగులు
సీతంపేట: సీతంపేట–కురుపాం మండల సరిహద్దు ప్రాంతమైన గుండాం గ్రామం వైపు ఏనుగులు వెళ్లినట్టు అటవీ శాఖ సిబ్బంది శనివారం తెలిపారు. గత పక్షం రోజులుగా నాలుగు ఏనుగులు మోహన్‌కాలనీ, గోరపాడు, చిన్నబగ్గ బీట్ పరిధిలో తిరిగి ఫైనాపిల్ పంటలను నాశనం చేశాయి. అరటి చెట్లను విరిచేశాయని స్థానికులు తెలిపారు. పంట నష్ట పరిహారం ఇచ్చే విధంగా అటవీ శాఖ చర్యలు తీసుకోవాలని గిరిజన రైతులు కోరుతున్నారు.
వ్యక్తిపై కేసు
వీరఘట్టం: మండలంలోని హుస్సేనుపురంలో కొద్ది రోజులుగా ఇద్దరు వ్యక్తుల మధ్య నెలకొన్న స్థల వివాదం చిలికిచిలికి గాలి వానలా మారింది. ఈ వివాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్.ఐ జి.కళాధర్ శనివారం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి...హుస్సేనుపురానికి చెందిన బంధువులైన వావిలపల్లి సూర్యనారాయణ, బొత్స రామారావులకు కొద్ది రోజులుగా గ్రామంలో ఓ స్థల వివాదం నడుస్తోంది. తన స్థలంలో పూరిపాక వేశారంటూ రామారావు శనివారం ఉదయం ఆ పూరిపాకపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. ఆ సమయంలో పూరిపాకలో ఉన్న సూర్యనారాయణ ప్రాణ భయంతో పరుగులు తీశాడు. ఈ ప్రమాదంలో సూర్యనారాయణ స్వల్పంగా గాయపడ్డాడు. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాల్సి ఉండగా ఇలా నిప్పు పెట్టి తనను భయబ్రాంతులకు గురిచేసిన రామారావుపై చర్యలు తీసుకోవాలని సూర్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఎస్.ఐ తెలిపారు.
గంజాయి నియంత్రణే
లక్ష్యంగా తనిఖీలు
విజయనగరం క్రైమ్: జిల్లా వ్యాప్తంగా గంజాయి రవాణ నియంత్రణే లక్ష్యంగా పోలీసులు శనివారం తనిఖీలు నిర్వహించారు. రైళ్లలో గంజాయి రవాణా జరగకుండా ఉండేందుకు ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో లోకల్ పోలీసులు, జీఆర్‌పీ, ఈగల్, ఆర్‌పీఎఫ్ పోలీసులు, డాగ్ స్క్వాడ్ సంయుక్తంగా బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపట్టినట్టు ఎస్పీ వకుల్ జందల్ తెలిపారు. ఒడిశా రాష్ట్రం నుంచి ప్రధానంగా రవాణ అవుతున్న నేపథ్యంలో ఈ తనిఖీలు ముమ్మరం చేసినట్టు చెప్పారు. విజయనగరం వన్‌టౌన్ సీఐ ఎస్.శ్రీనివాస్ సిబ్బందికి ముందస్తుగా కొన్ని సూచనలు చేసి తనిఖీలపై అవగాహన కల్పించారు. తనిఖీల్లో తెర్లాం ఎస్‌ఐ సాగర్‌బాబు, జీఆర్‌పీ ఎస్‌ఐ మధుసూదనరావు, ఆర్‌పీఎఫ్ ఎస్‌ఐ శ్రీధర్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది, 40 మంది సిబ్బంది పాల్గొన్నారు.

గుండాం సమీపంలో ఏనుగులు

గుండాం సమీపంలో ఏనుగులు