
బుచ్చెంపేటలో పోలీస్ పికెట్
రాజాం సిటీ: మున్సిపాల్టీ పరిధి బుచ్చెంపేట గ్రామంలో ఎటువంటి అల్లర్లు జరగకుండా ఉండేందుకు సోమవారం పోలీస్ పికెట్ ఏర్పాటు చేశామని టౌన్ సీఐ కె.అశోక్‌కుమార్ తెలిపారు. గ్రామంలో స్థల వివాదానికి సంబంధించి రెండు వర్గాల మధ్య కొట్లాట జరిగిన విషయం తెలిసిందే. దీని దృష్ట్యా ముందస్తు చర్యల్లో భాగంగా పికెట్ నిర్వహించడంతో పాటు పర్యవేక్షణ చేపడుతున్నామని తెలిపారు. వివాదానికి కారణమైన ప్రదేశాన్ని పరిశీలించారు. గ్రామంలో ఎవరైనా అనవసరంగా కవ్వింపు చర్యలు, రెచ్చగొట్టే కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రైల్వే పార్కింగ్ ఫీజు పెంపుపై ఆందోళన
● డీఆర్‌ఎంకు వినతినిచ్చిన ప్రయాణికులు
విజయనగరం టౌన్: విజయనగరం రైల్వేస్టేషన్‌లో వాహనాలు పార్కింగ్ చేసేవారినుంచి ప్రైవేటు పార్కింగ్ వ్యవస్థ నిలువు దోపిడీకి రంగం సిద్ధం చేసింది. నెలకు రూ.300 ఉన్న పార్కింగ్ ఫీజును ఒకేసారి మూడురెట్లు పెంచి రూ.900 చేయడంతో చిరుద్యోగులు, దినసరి కూలీలు భగ్గుమన్నారు. పార్కింగ్ ఫీజుల దోపిడీపై సోమవారం సాయంత్రం ఆందోళనకు దిగారు. విజయనగరం నుంచి విశాఖ పట్టణం వెళ్లేందుకు రైల్వే మంత్లీ సీజన్ టికెట్ (ఎంఎస్‌టీ) రూ.250 ఉంటే, వాహనం పార్కింగ్ ఫీజు రూ.900లకు పెంచడమేమిటంటూ పార్కింగ్ సిబ్బందిని నిలదీశారు. రోజుకు బైక్‌కు రూ.10లు ఉన్న ఫీజును రూ.40కి ఎలా పెంచుతారని నిలదీశారు. దీనిపై డీఆర్‌ఎమ్‌ఏ కు వినతిపత్రం అందజేశారు. రైల్వే ఉన్నతాధికారులు స్పందించి ఫీజులు తగ్గించుకుంటే
ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
బ్యాటరీ స్కూటీలు దగ్ధం
బొబ్బిలి: పట్టణంలోని సిరిపురపు వీధిలో ఓ వ్యక్తి ఇంటి ముందు ఉంచిన బ్యాటరీ స్కూటీ సోమవారం పేలిపోయింది. దీనిపక్కనే ఉన్న మరో స్కూటీ కూడా మంటల ధాటికి కాలిపోయింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా బ్యాటరీ వాహనం కాలిపోయినట్టు వాహనదారులు చెబుతున్నారు.
పకడ్బందీగా ఏపీపీఎస్‌సీ పరీక్షలు
విజయనగరం అర్బన్: జిల్లాలో ఈ నెల 15 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్న లెక్చరల్ పోస్టుల పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని జేసీ ఎస్.సేతుమాధవన్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటుచేసిన సమావేశంలో పలు సూచనలు చేశారు. రాజాంలోని జీఎంఆర్, జొన్నాడ లెండీ, గాజులరేగ వద్ద ఉన్న ఐయాన్ డిజిటల్ జోన్, చింతలవలస ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కాలేజీల్లో పరీక్షల ఏర్పాట్లపై ఆరా తీశారు. సమావేశంలో ఏపీపీఎస్‌సీ, పోలీస్, రెవెన్యూ, ప్రజా రవాణా, విద్యుత్, వైద్య ఆరోగ్యశాఖ అఽధికారులు పాల్గొన్నారు.
95:5 నిష్పత్తిలో బియ్యం సరఫరా
రామభద్రపురం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 95:5 శాతం నిష్పత్తిలో జిల్లాలో ఉన్న 5,71,288 రేషన్ కార్డుదారులకు ఉచితంగా బియ్యం సరఫరా చేస్తున్నట్టు డీఎస్‌ఓ మధుసూదనరావు తెలిపారు. మండలంలోని పలు రేషన్ దుకాణాలను సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తకార్డు ల కోసం 53,500 దరఖాస్తులు రాగా 37,351 దరఖాస్తుదారులను అర్హులుగా గుర్తించామని, వారికి త్వరలో స్మార్ట్ కార్డులు మంజూరుచేసే అవకాశం ఉందన్నారు.

బుచ్చెంపేటలో పోలీస్ పికెట్

బుచ్చెంపేటలో పోలీస్ పికెట్

బుచ్చెంపేటలో పోలీస్ పికెట్