
ఉద్యోగుల సమస్యలను విస్మరిస్తున్న కూటమి
విజయనగరం అర్బన్: ఉద్యోగ, ఉపాధ్యాయుల సంక్షేమం, సమస్యలను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఐక్య పోరాటాలకు సిద్ధంకావాలని ఏపీ ఎన్‌జీఓ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ పిలుపునిచ్చారు. సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీవీ రమణలో కలిసి జిల్లా పర్యటనకు శుక్రవారం వచ్చారు. తొలుత జిల్లా ప్రవేశంలోని వై జంక్షన్ నుంచి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు ఉద్యోగులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఆత్మీయ సభలో ఆయన మాట్లాడారు. గత ఏడాది కాలంగా ఉద్యోగుల సమస్యలపై కూటమి ప్రభుత్వం ఏమీ స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రివర్స్ పీఆర్‌సీ, హెచ్‌ఆర్ బిల్లులు, పీఎఫ్, జీపీఎఫ్ పెండింగ్ బిల్లుల చెల్లింపులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని చెప్పారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.27,500 కోట్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ కార్యక్రమంలో ప్రజావసరాల పనులను కర్తవ్యంగా నిర్వహిస్తున్నారని, ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రయోజనాలు రావడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. వాటిని సాధించుకునేందుకు ఉద్యమ ప్రణాళికను రూపొందిస్తున్నామని తెలిపారు. ప్రధాన కార్యదర్శి డీవీ రమణ మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగ సంఘాలకు పూర్తి సహకారం అందించాలని పిలుపునిచ్చారు. అనంతరం రాష్ట్ర, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు జి.శ్రీధర్‌బాబు, కార్యదర్శి ఎ.సురేష్, సహాయఅధ్యక్షుడు జీవీఆర్‌ఎస్ కిశోర్, ఉత్తరాంధ్ర జిల్లాల ఎన్‌జీఓ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఐక్యపోరాటాలకు సిద్ధంగా ఉండాలి
ఏపీఎన్‌జీఓ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పిలుపు